Share News

జెడ్పీ విభజన సంగతేంటి..?

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:24 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత పాలకవర్గం పదవీకాలం మరో 15 నెలల్లో ముగియనుండటంతో విభజన అంశంపై ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చనడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 49 మండలాలు కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలుగా విడిపోయాయి. ఆయా జిల్లాలకు ఉద్యోగులు, అధికారుల సర్దుబాటు, కార్యాలయాల విభజన, ఇతర భవనాల ఏర్పాటుపై ఇంత వరకు ఎటువంటి కార్యాచరణ ప్రారంభంకాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాకు ప్రత్యేకంగా జిల్లాపరిషతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చర్యలు చేపడితే అప్పటి పూర్తవుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

జెడ్పీ విభజన సంగతేంటి..?

- 2026, సెప్టెంబరుతో ముగియనున్న పాలకవర్గం పదవీకాలం

- 3 జిల్లాల్లో చేరిన ఉమ్మడి కృష్ణాలోని 49 మండలాలు

- కృష్ణాకు 25, ఎన్టీఆర్‌కు 16, ఏలూరుకు 8 మండలాలు కేటాయింపు

- ఆయా జిల్లాలకు ఉద్యోగులు, అధికారుల సర్దుబాటు తప్పనిసరి

- కార్యాలయాలు, ఇతర భవనాల ఏర్పాటుపై ఏది ప్రణాళిక!

- ఎన్టీఆర్‌ జిల్లాకు ప్రత్యేకంగా జిల్లాపరిషతను రూపొందించాల్సిందే!

-ఇప్పుడు ప్రారంభిస్తేనే అప్పటికి పూర్తవుతుందంటున్న ఉద్యోగులు

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత పాలకవర్గం పదవీకాలం మరో 15 నెలల్లో ముగియనుండటంతో విభజన అంశంపై ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చనడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 49 మండలాలు కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలుగా విడిపోయాయి. ఆయా జిల్లాలకు ఉద్యోగులు, అధికారుల సర్దుబాటు, కార్యాలయాల విభజన, ఇతర భవనాల ఏర్పాటుపై ఇంత వరకు ఎటువంటి కార్యాచరణ ప్రారంభంకాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాకు ప్రత్యేకంగా జిల్లాపరిషతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చర్యలు చేపడితే అప్పటి పూర్తవుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 49 మండలాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత 25 మండలాలు కృష్ణాజిల్లాలోకి, 16 మండలాలు ఎన్టీఆర్‌ జిల్లాలోకి, ఎనిమిది మండలాలు ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. అయినప్పటికీ జిల్లా పరిషత పాలకవర్గం నేటికీ ఉమ్మడి జిల్లాగానే పరిగణిస్తున్నారు. మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయం నుంచే పరిపాలనను కొనసాగిస్తున్నారు. జెడ్పీ పాఠశాలలతో పాటు, మండల పరిషత కార్యాలయాలకు సంబంధించిన పాలన యావత్తు మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయం కేంద్రంగానే సాగుతోంది. జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అన్ని విభాగాల అధికారులు హాజరవుతున్నారు. అయితే జెడ్పీ పాలకవర్గం పదవీకాలం మరో 15 నెలల వ్యవధిలో ముగియనుంది. అత్యంత కీలకమైన జెడ్పీలోని పరిపాలనా విభాగాలను విడగొట్టేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం జరగలేదనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడచింది. ఈ ఏడాది కాలంలో నాలుగు విడతల్లో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన శాసన సభ్యులు హాజరుకాలేదు. కలెక్టర్‌, జేసీ స్థాయి అధికారులు ఒకటీ, రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. జెడ్పీ విభజన జరిగితే జెడ్పీలో పనిచేసే అధికారులు కృష్ణాజిల్లాకు 50శాత మంది, ఎన్టీఆర్‌ జిల్లాకు 30 శాతం, ఏలూరు జిల్లాకు 20శాతం మందిని సర్థుబాటు చేయాల్సి ఉంటుంది.

ఉన్న భవనాలను కూలగొట్టి..

ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ వద్ద జెడ్పీకి సంబంధించిన గెస్ట్‌హౌస్‌ ఉండేది. ఈ గెస్ట్‌హౌస్‌ను గతంలో పనిచేసిన జెడ్పీ చైర్మన్‌లు క్యాంప్‌ కార్యాలయంగా వాడుకునేవారు. దీంతో పాటు జిల్లా పంచాయతీ అధికారి క్యాంప్‌ కార్యాలయం, పంచాయతీరాజ్‌ విభాగం డీఈ కార్యాలయం, విజిలెన్స్‌ విభాగం డీఈ కార్యాలయం, ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన ఈఈ కార్యాలయం ఇక్కడ కొనసాగేవి. వైసీసీ ప్రభుత్వ హాయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ కార్యాలయంలో కొంత భాగాన్ని తన కార్యాలయంగా వాడుకున్నారు. మూడేళ్ల క్రితం ఈ భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా నిర్మాణం చేసే పేరుతో కూలగొట్టేశారు. ఆ తర్వాత ఈ భవనం స్థలాన్ని ఒక పారిశ్రామికవేత్తకు లీజుకు ఇచ్చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే అంశంపై గుసగుసలు వినిపించాయి. అయితే కూలగొట్టిన భవనం స్థానంలో ఇప్పటివరకు ఎలాంటి కట్టడాలను ప్రారంభించలేదు. అంచనాలు కూడా నేటికీ రూపొందించలేదు. పాత భవనం కూల్చివేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఏడాదికి రూ.3 కోట్లు చొప్పున జెడ్పీ నిధులను విడుదల చేస్తే ఈ పాటికి బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయ్యేదని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. జెడ్పీ ఆస్తులు ఏ జిల్లా పరిధిలోనివి ఆ జిల్లాకు చెందినవిగానే చూపుతారా లేక ఉమ్మడి ఆస్తిగానే పరిగణిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికైనా భవనాల నిర్మాణంపై దృష్టి సారిస్తారా!

ప్రస్తుతం కొనసాగుతున్న జెడ్పీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది సెప్టెంబరుతో ముగియ నుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలకు అధికారులు, ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంది. కార్యాలయాల భవనాలు, సమావేశపు మందిరాలు, అధికారులకు సంబంధించిన గృహాలు, గెస్ట్‌హౌస్‌లు నిర్మాణం చేయాల్సి ఉంది. కృష్ణాజిల్లాకు సంబంధించి మచిలీపట్నంలో జెడ్పీ ప్రాంగణంలో పాత సమావేశపుహాలు, కార్యాలయ భవనాలు ఉన్నాయి. జెడ్పీ సీఈవో భవనాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయానికి కేటాయించారు. ఏలూరు జిల్లాలోని ఎనిమిది మండలాలు ఆ జిల్లాకు వెళ్లిపోతాయి. జెడ్పీ విడిపోతే ఎన్టీఆర్‌ జిల్లాలో సమాశపుహాలు, కార్యాలయం నిర్వహణ కోసం భవనాలు సమకూర్చుకోవాల్సి ఉంది. జెడ్పీకి సంబంధించి అత్యంత విలువైన స్థలం విజయవాడలో ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో వసతులు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది. ఎప్పటికి టెండర్లు పిలుస్తారు, ఎప్పటికి భవనాల నిర్మాణం పూర్తి చేస్తారనే అంశంపై అనేక సందేహాలను జెడ్పీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పరిషత విభజన కసరత్తు ప్రారంభించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 01:24 AM