Share News

CM Chandrababu: ప్రజాస్వామ్యంలో సంక్షేమం తప్పనిసరి

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:04 AM

ప్రజాస్వామిక దేశంలో సంక్షేమం తప్పనిసరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ఆర్థిక అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం అవసరమన్నారు.

 CM Chandrababu: ప్రజాస్వామ్యంలో సంక్షేమం తప్పనిసరి

  • ఆర్థికాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం

  • పేద, ధనిక అంతరం తగ్గించడానికే పీ-4

  • ప్రభుత్వానికి ప్రైవేటు రంగం తోడ్పడాలి

  • క్వాంటమ్‌ ఫలితాలు జనవరిలో కనిపిస్తాయి

  • భారత్‌ శక్తిని ఎవరూ అడ్డుకోలేరు

  • ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకోగలం

  • అమెరికా సుంకాలతో సమస్యలు తాత్కాలికమే

  • మోదీ ప్రపంచంలోనే బలమైన నాయకుడు

  • ఆయన ప్రధాని కావడం గర్వకారణం: చంద్రబాబు

  • ఈటీ వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం సదస్సులో ప్రసంగం

న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక దేశంలో సంక్షేమం తప్పనిసరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ఆర్థిక అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం అవసరమన్నారు. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించగలమని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ తాజ్‌ప్యాలెస్‌లో ‘వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం-2025’ పేరిట ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఉన్నవారికి, లేనివారికి మధ్య అగాథాన్ని ఎలా పూరించాలన్నదే నా ఆలోచన. ఒకవైపు అత్యంత్య సంపన్నులు, మరోవైపు అంత్యంత నిరుపేదలు ఉన్నారు. అందుకే నేను పీ-4 పేరిట ప్రజలను సంక్షేమంలో భాగస్వాములను చేయాలని అనుకున్నాను. అన్ని అవకాశాలూ ఉన్న సంపన్నులు.. చివరి వరుసలో ఉన్నవారిని దత్తత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం ప్రజలకు చేయూత ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం చేస్తున్న దానికి ప్రైవేటు రంగం తోడ్పడాలి. ఈ రకంగా అసమానతలు తగ్గించాలన్నదే నా ధ్యేయం’ అని తెలిపారు. యాజమాన్య స్ఫూర్తిని, వారి పనితీరును నియంత్రించకూడదని.. అదే సమయంలో అట్టడుగు వారిని ఎలా పైకి తేవాలన్నదీ ఆలోచించాలని సూచించారు. ఆ దిశగా విధానాలకు రూపకల్పన చేయాలన్నారు. అభివృద్ధి దిశలో ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు అంతటా ప్రోత్సాహక వాతావరణం కనపడుతోందన్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ వాటన్నింటిని అధిగమించి అభివృద్ధి కాముకుడిగా గుర్తింపు పొందానని తెలిపారు. సుదీర్ఘ కాలం సీఎంగానే గాక ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశానని.. ప్రతిపక్షంలో, ప్రభుత్వంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని చెప్పారు. ప్రధాని మోదీ చేపట్టిన క్వాంటమ్‌ మిషన్‌ వచ్చే జనవరిలోనే ఫలితాలు చూపిస్తుందని, అది ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమవుతుందన్నారు.


మనది బలమైన ఆర్థిక వ్యవస్థ..

ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ తట్టుకోగలిగిన బలమైన ఆర్థిక వ్యవస్థ భారత్‌కు ఉందని సీఎం తెలిపారు. ఆమెరికా సుంకాలవంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికమేనని స్పష్టం చేశారు. భారతదేశ శక్తిని ఎవరూ అడ్డుకోలేరని, 2047 నాటికి భారతదేశం, భారతీయులు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలదొక్కుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. దేశ ఆర్థికవ్యవస్థకు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించి పరిష్కరించుకోగల సామర్థ్యం మనకు ఉందన్నారు. గత పదేళ్లకు పైగా భారతదేశం అన్ని అవాంతారాలను అధిగమించి ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిందని.. మనకు సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారని.. ప్రపంచంలోనే బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన మోదీ మన ప్రధాని కావడం మనకు గర్వకారణమని అన్నారు. ఆమెరికా, చైనాలను మించి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామని చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం, అన్ని రంగాల్లో ముందడుగు వేయడంతో ప్రయోజనాలు సమకూరడం, అత్యధిక మాన వవనరులు ఉండడం దేశానికి వరాలుగా మారాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువజనాభా ఉండడం మనకు లభించిన అతిపెద్ద అవకాశమని చెప్పారు. అన్నిటికంటే మించి ఈ దేశానికి మోదీ నాయకుడు కావడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని, ఆ లక్ష్యాన్ని సాధించే సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పారు.

Updated Date - Aug 23 , 2025 | 05:09 AM