మూడో టవర్ నిర్మాణానికి అనుమతివ్వబోం
ABN , Publish Date - May 16 , 2025 | 12:43 AM
‘‘తమ పొలాల గుండా మూడో టవర్ నిర్మాణానికి తామంతా అనుమతించబోం. ఉన్న రెండు టవర్‌ల మధ్యలో నుంచి విద్యుత లైను వేసుకోండి. లేనిపక్షంలో తామంతా కోర్టును ఆశ్రయిస్తాం. అసలు విద్యుత లైన్‌ల ఏర్పాటు అలైన్‌మెంట్‌ను రెండు సార్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలి’’ అంటూ రైతులు అధికారులను నిలదీశారు. సమాధానం చెప్పాల్సిన విద్యుత శాఖ అధికారులు నీళ్లునమిలారు.
-అలైన్‌మెంట్ ఎందుకు మార్చారో చెప్పాలి
-అధికారులను నిలదీసిన రైతులు
-నీళ్లు నమిలిన విద్యుత శాఖ అధికారులు
-ఆర్డీవో కార్యాలయంలో రసాభాసగా రైతుల సమావేశం
గుడివాడ, మే 15(ఆంధ్రజ్యోతి): ‘‘తమ పొలాల గుండా మూడో టవర్ నిర్మాణానికి తామంతా అనుమతించబోం. ఉన్న రెండు టవర్‌ల మధ్యలో నుంచి విద్యుత లైను వేసుకోండి. లేనిపక్షంలో తామంతా కోర్టును ఆశ్రయిస్తాం. అసలు విద్యుత లైన్‌ల ఏర్పాటు అలైన్‌మెంట్‌ను రెండు సార్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలి’’ అంటూ రైతులు అధికారులను నిలదీశారు. సమాధానం చెప్పాల్సిన విద్యుత శాఖ అధికారులు నీళ్లునమిలారు. గుడివాడ(లింగవరం) - యలమర్రు వరకు ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో మూడు మండలాల గుండా గతంలో 130, 220 కె.వి రెండు విద్యుత టవర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పలుమార్లు లైన్ల తాలుకు అలైన్‌మెంట్‌లను మార్చారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో విద్యుత లైను ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధమైంది. దీనిపై గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వేదికగా ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన మూడు మండలాల తహశీల్దార్లు, రైతులు, విద్యుత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో రెండు పర్యాయాలు అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చారో అధికారులు స్పష్టత ఇవ్వాలని, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు తమన బలి చేశారో చెప్పాలని రైతులు పట్టుబట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జరిగిందని విద్యుత అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. అదే గ్రామాల గుండా మూడో విద్యుత లైను ఏర్పాటు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పంట పొలాల గుండా రెండు టవర్ల ఏర్పాటు చేశారని, వాటి మధ్యలో లేదా వాటి మీదనే మరో విద్యుత లైను ఏర్పాటు చేసుకోవాలని రైతులు అధికారులకు సూచించారు. టెక్నికల్‌గా కుదరదని, మూడో విద్యుత లైను ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం విద్యుత లైను ఏర్పాటు తప్పదని స్పష్టం చేశారు. మచిలీపట్నం పోర్టు, పెడన తదితర ప్రాంతాలకు విద్యుత సరఫరా నిమిత్తం మూడో లైను ఆవశ్యకత ఉందన్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా పొలాల గుండా మరో విద్యుత లైను ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని, కోర్టును ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు. ఎటు తేలకుండానే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో గుడివాడ, లింగవరం, మెరకగూడెం, జొన్నపాడు, గుర్విందగుంట, పెదపారుపూడి రైతులు, ఏపీ ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు.