సీమను సస్యశ్యామలం చేస్తాం
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:53 PM
రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు కృష్ణాజలాలను తరలించి సస్యశ్యామలం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
68 చెరువులకు నీటివిడుదల
కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలు కోట్ల, కేఈ
పత్తికొండ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు కృష్ణాజలాలను తరలించి సస్యశ్యామలం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఈ మేరకు కృష్ణగిరి మండలంలోని ఆలంకొండ వద్ద పంప్‌హౌస్ నుంచి హంద్రీనీవా ద్వారా 68 చెరువులకు నీటిని మంత్రితో పాటు డోన, పత్తికొండ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ శ్యాంబాబులు విడుదల చేశారు. తొలిరోజు 80 క్యూసెక్కుల నీటిని అధికారులు చెరువులకు మళ్లించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాయలసీమను సస్యశ్యామల ప్రాంతంగా చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పించారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పత్తికొండ, డోన, ఆలూరు నియోజకవర్గాల్లోని చెరువులకు కృష్ణా జలాలతో నింపడం సాధారణ విషయం కాదన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముందుచూపుతో చేసిన ఆలోచన ఇప్పుడు కరువు పల్లెలకు వరమైందన్నారు. ఈక కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన నాగేశ్వరయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, మాజీ డీసీఎంఎస్ చైర్మన లక్ష్మికాంతరెడ్డి, పత్తికొండ మార్కెట్‌యార్డ్ చైర్మన ఆలంకొండ నబి, నాయకులు ఎల్వీ ప్రసాద్, మర్రి శ్రీరాములు, దామోదర్‌నాయుడు, గురుస్వామి, మహమ్మద్‌రఫి తదితరులు ఉన్నారు.
చేయాల్సింది ఎంతోఉంది : కేఈ శ్యాంబాబు, ఎమ్మెల్యే
68 చెరువులకు నీటిని నింపడంతో అనుకున్న పని పూర్తి కాలేదు. ఆ చెరువుల నుంచి పిల్ల కాలువల ద్వారా పొలాలకు సాగునీరు చేరాలి. కుంటలకు నీటిని నింపుకోవాలి. భవిష్యతలో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే రోజు రావాలి. మా నాన్న కేఈ కృష్ణమూర్తి నాడు ప్రారంభించిన ఈయజ్ఞం నేను ఎమ్మెల్యేగా ఉన్నరోజున పూర్తికావడం ఆనందంగా ఉంది.
అంతా మంచే జరుగుతుంది
- కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే
మాది ప్రజల కోసం పనిచేసే మంచి చేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అంతామంచే జరుగుతుంది. డోన నియోజకవర్గంలో అన్నిచెరువులను నింపుతాం. డోనను అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాన్ని నిధులు మంజూరు చేయాలని కోరాం. నిధులు మంజూరైన వెంటనే పనులు త్వరితగతిన చేపడుతాం.