Share News

చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:30 AM

ఏపీ చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురలపాక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
డోన డంప్‌ యార్డులో పర్యటిస్తున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోట్ల

మున్సిపల్‌ వ్యవస్థను సర్వనాశం చేసిన వైసీపీ

వారి పాపాలే.. ఆ శాఖకు శాపాలు

85లక్షల టన్నుల చెత్తను వదిలివెళ్లింది

రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ

డోనలో విస్తృత పర్యటన

ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే, నాయకులు

డోన టౌన, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురలపాక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన డోనలో పర్యటించారు. మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. డోన డంపింగ్‌ యార్డులో లెగసి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంటు పనులను ఎమ్మెల్యేతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్త తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ చేసిన రాష్ర్టాన్ని, మున్సిపల్‌ వ్యవస్థను సర్వనాశనం చేశాయన్నారు. వారు చేసిన అరాచకాలు, అవకతవకల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయట పడుతుందని అన్నారు. చెత్త పన్ను పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను పీడించిందన్నారు. 85 లక్షల టన్నుల చెత్తను మాత్రం వదిలి వెళ్లిందని, వారు వదిలి వెళ్లిన చెత్తను తాము తొలగిస్తున్నామన్నారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి నాటికి ఈ చెత్తనంగా పూర్తి స్థాయిలో తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. రాష్ట్రంలో రీసైక్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 79 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, ఇంకా 6 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని తెలిపారు. ఒక్క డోనలో 50వేల టన్నుల చెత్తకు గానూ 36వేల టన్నులు తొలగించామన్నారు. భవిష్యత్తులో చెత్త సమస్య లేకుండా వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో డంపింగ్‌ యార్డులే లేకుండా చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అని వివరించారు. ఒక వైపు 10 లక్షల కోట్ల అప్పు కడుతూ మరో వైపు అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఉన్నత ఉద్దేశంతో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వచ్చే మార్చి నాటికి టిడ్కో ఇళ్ల సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. డంప్‌ యార్డు పరిశీలించిన అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే కోట్ల స్వగృహానికి చేరుకుని అల్పాహారం చేసిన అనంతరం మంత్రి అనంతపురానికి బయలుదేరి వెళ్లారు.కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, ఆర్డీవో కేసీ నరసింహులు, తహసీల్దార్‌ రవికుమార్‌, మున్సిపల్‌ డీఈ రఘు, ఏఈ సురేష్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్‌, టీడీపీ అధికార ప్రతినిధి విజయభట్టు, భాస్కర్‌ నాయుడు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, సర్పంచ అర్జునరెడ్డి, కోట్రికే హరికిషన, పెద్ద కేశవయ్యగౌడు, చిన్న మల్కాపురం సుధాకర్‌ రెడ్డి, వాస్తు లక్ష్మన్న, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:30 AM