విచారించి న్యాయం చేస్తాం: ఎస్పీ
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:41 PM
:ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు.
కర్నూలు క్రైం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు. నగరంలోని కొత్తపేటలోని టూటౌన పోలీస్‌స్టేషన సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 81 పిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన పీరా, సీఐలు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
కర్నూలు అశోక్‌నగర్‌కు చెందిన వినయ్ కుమార్ నా భార్యకు కడప రిమ్స్‌లో స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశారని నంద్యాల పట్టణానికి చెందిన ప్రదీప్ ఫిర్యాదు చేశారు.ఆధార్ సెంటరు ఇప్పిస్తామని చెప్పి కర్నూలు బుధవారపేట చెందిన బోయ రాజశేఖర్ రూ.60వేలు తీసుకుని మోసం చేశారని మంత్రాలయానికి చెందిన వీరేష్ ఫిర్యాదు చేశారు. పసుపుల,రుద్రవరం నూతనపల్లె గ్రామాల రైతుల నుంచి పసుపుల గ్రామంకు చెందిన పకిడి ఖాజా క్వింటాళ్లలో పొగాకు కొనుగోలు చేసి అమ్ముకుని డబ్బులు ఇవ్వకుండా పలువురు రైతులను మోసం చేస్తున్నారని కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన సుల్తాన ఫిర్యాదు చేశారు. తమ 5 ఎకరాల పొలానికి వెళితే గుర్రం నాగన్న, వెంకటస్వామి, వెంకట్రాముడు, ఉపేంద్రలు కొట్టడానికి వస్తున్నారని, సర్వే చేయించడానికి వారు సహకరించేలా చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కనకమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు చెందిన రవీంద్ర అనే వ్యక్తి పాతబస్తీ, పూలబజారుకు చెందిన కొంత మంది మహిళల నుంచి ఆధార్ కార్డు, పానకార్డు, సిమ్‌కార్డు ఫోటోలు తీసుకుని ఒక్కొక్కరికి రూ.5వేల నుంచి రూ.10వేల మాదిరిగా ఇచ్చి బ్యాంకు ఖాతాలు ఓపెన చేస్తూ వారికి తెలియకుండా వారి పేర్ల మీద ఏసీలు, టీవీలు, సెల్‌ఫోన్లు తీసుకుని మోస్తం చేస్తున్నాడని కర్నూలు వడ్డెగేరికి చెందిన షేక్ సన ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లెకు చెందిన చిట్టెమ్మ ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసుకుని రాజు, మహేష్ అనే వ్యక్తులు ఆస్తిని ఆక్రమించుకోవాలని నన్ను, తన నానమ్మను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని ఆదోని పట్టణం రాహుల్ ఫిర్యాదు చేశాడు.