Share News

BJP State President Madhav: మతోన్మాదాన్ని అణిచివేస్తాం

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:42 AM

మతోన్మాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణిచివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

 BJP State President Madhav: మతోన్మాదాన్ని అణిచివేస్తాం

  • ఉగ్ర కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: మాధవ్‌

పార్వతీపురం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మతోన్మాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణిచివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఉగ్ర కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించి, అభ్రిపాయాలు సేకరించారు. నామినేటెడ్‌ పదవుల్లో బీజేపీకి రావాల్సిన వాటా సాధిస్తామని చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. సమావేశం తర్వాత మాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదులను మట్టుబెట్టి భారత్‌ను ఉగ్రరహిత దేశంగా తీర్చిదిద్దుతామని అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి మన దేశంలోకి చొరబడిన అనేకమంది రోహింగ్యాలు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేటెడ్‌ పదవులు నిష్పత్తి ప్రకారం వస్తాయని, ఎవరూ నిరాశ పడవద్దని చెప్పారు. పదవుల పంపిణీకి సంబంధించి కూటమి పార్టీల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నమాట వాస్తమేనని మాధవ్‌ పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 05:43 AM