అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:42 AM
మచిలీపట్నం పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రారంభించడం ద్వారా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జిల్లా సమీక్షా మండలి సమావేశం జిల్లా పరిషత సమావేశపు హాలులో శుక్రవారం జరిగింది.
- మచిలీపట్నం పోర్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తాం
- జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్
- రహదారులకు నిధుల కేటాయింపులో సమాచారంలేదన్న ఎమ్మెల్యేలు
- ఆలస్యంగా సమావేశం ప్రారంభం కావడంపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అసహనం
- చెరువుల రిజిస్ర్టేషన్ ప్రక్రియలో మత్స్యశాఖ తీరుపై విమర్శలు
మచిలీపట్నం, డి సెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
మచిలీపట్నం పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రారంభించడం ద్వారా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జిల్లా సమీక్షా మండలి సమావేశం జిల్లా పరిషత సమావేశపు హాలులో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సుభాష్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. జిల్లాలో మొంథా, దిత్వా తుఫానుల సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూశారని తెలిపారు. పంట నష్టం అంచనాల తయారీని కూడా వేగవంతంగా పూర్తి చేశారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టుతో పాటు గన్నవరం విమానాశ్రయాన్ని మరింతగా అభివృద్ధిలోకి తెస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.
అన్నదాత సుఖీభవ నగదు జమకాలేదు
జిల్లాలో అర్హులైన పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ నగదు జమకాలేదని ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. లంక భూముల్లో పంటలు సాగు చేసిన కనిగిరిలంక, ఐలూరు తదితర గ్రామాల రైతులు, కౌలురైతులకు ఈ పథకం అందలేదని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. లంక భూములను ఈ-కారప్‌లో కూడా నమోదు చేయడం లేదని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నాణ్యత బాగోలేదని, మానుగాయ వచ్చిందని, తేమశాతం అధికంగా ఉందని మిల్లర్లు అనేక సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బందులకు గరిచేశారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమావేశం దృష్టికి తెచ్చారు. మెట్ట ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోరారు. ఆయిల్ ఫాం సాగులో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. పశువైద్యశాలల్లో అవసరమైన మందులు అందుబాటులో లేవని, వాటిని సమకూర్చే ఏర్పాటు చేయాలని, పశువులు వివిధ కారణాలతో మరణిస్తే బీమా సొమ్మును అందజేయడం లేదని ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈదులమద్దాలి గ్రామంలోని పశువైద్యశాలలో డాక్టర్ అందుబాటులో లేరని, దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పామర్రు ఎమ్మెల్యే వర్ల అన్నారు. చేపల చెరువుల రిజిస్ర్టేషన్‌లో మత్స్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల మండిపడ్డారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలాజీ క్షేత్రస్థాయికి వెళ్లి పూర్తిస్థాయి నివేదికను తనకు అందజేయాలని మత్స్యశాఖ జేడీకి సూచించారు.
ఎమ్మెల్యేల సిఫార్సులను పక్కనపెట్టేశారు..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గుంతలమయంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు పంపిన సిఫార్సులను పక్కనపెట్టి, వేరే రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించారని, ఇది ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఒక్కో నియోజకవర్గంలో నాలుగు, ఐదు మండలాలు ఉన్నాయని, కేవలం రూ.10 కోట్లలోపుు నిధులను మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఏయే రహదారులు బాగోలేదో ఎమ్మెల్యేలకు అవగాహన ఉందని, అయినా పూర్తిగా పాడైన రహదారులను పక్కనపెట్టి, అవసరం లేని రహదారులకు నిధులు కేటాయించారని ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర ్లకుమార్ రాజా ఆరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఒకే మండలం ఉంటే అధికంగా నిధులు విడుదల చేయించుకోవడంలో మంత్రి కొల్లు రవీంద్ర సఫలీకృతులయ్యారని, ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చేయి చూపారని అన్నారు. రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రజలు తమపై తీవ్రస్థాయితో ఒత్తిడి తెస్తున్నారని, రహదారుల అభివృద్ధి పనుల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్యేలు ఈ సందర్బంగా కోరారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను సంప్రదించకుండా పంచాయతీరాజ్ విభాగం అధికారులు రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఎలా పంపారని వారు ప్రశ్నించారు. అత్యవసరంగా పనులు చేయాల్సిన రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు పంపేందుకు అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. తాగునీటి పథకాలకు సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయడానికి అవకాశం లేకుండా పోతోందని, వాటికి ఉన్న మెట్లు పాడైపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న ట్యాంకులకు పాత పద్ధతిలోనే మెట్లు కడుతున్నారని, ఈ విధానంలో మార్పులు తేవాలని ఎమ్మెల్యేలు కోరారు.
డ్రెయిన్లు, కాల్వల్లో పూడికతీత అంచనాలు తయారు చేయండి
రబీ సీజన్‌లో సాగు నీటిని విడుదల చేయని నేపథ్యంలో పంట కాల్వలు, డ్రెయినేజీలలో పూడికతీత పనులకు ఇప్పటి నుంచే అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు కాల్వపై ఎనికేపాడు వద్ద అండర్ టన్నెల్ నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో బాపులపాడు, నందివాడ, గన్నవరం మండలాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురువుతాయని, ఈ మండలాల్లోని తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. బంటుమిలి కెనాల్ గట్లు బలహీనంగా మారాయని, ఈ కాల్వ గట్లను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు. జిల్లాలోని అన్ని ప్రధాన డ్రెయినేజీలలో పూడిక తీసేందుకు అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. బంటుమిల్లి మండలం మల్లంపూడిలో రూ.35 లక్షల అంచనాలతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులకు ఎంపీ వల్లభనేని బాలశౌరి, తాను శంకుస్థాపన చేశామని, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాక, ఆర్‌డబ్య్లూఎస్ అధికారికి, కాంట్రాక్టర్‌కు ఉన్న విభేదాల కారణంగా ఈ ఓవర్ హెడ్ ట్యాంకును వేరే ప్రాంతంలోకి మార్చాలని చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే కాగిత అధికారులను ప్రశ్నించారు. ఈ అంశంపై థర్ట్ పార్టీతో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.
ఆలస్యంగా సమావేశం ప్రారంభిస్తే ఎలా?
జిల్లా సమీక్షా మండలి సమావేశం ఆలస్యంగా ప్రారంభించడంపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారని, ఎమ్మెల్యేలంతా సకాలంలో ఈ సమావేశానికి వచ్చారని, మంత్రులు మాత్రం రెండు గంటలు ఆలస్యంగా వచ్చి సమావేశాన్ని ప్రారంభిస్తే ఎలాగని ఆయన ప్రశ్నించారు. గతంలో తాను మంత్రిగా పనిచేశానని, డీఆర్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగాయని, ఇకనైనా ఆలస్యం జరగకుండా చూడాలని ఆయన సూచించారు. ఈసారి మార్చి 20వ తేదీన ఉదయం సమయంలోనే సమావేశం ప్రారంభించి రోజంతా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ జడ్పీ నిధులతో చేపట్టిన పనులను అకారణంగా రద్దు చేశారని ఆరోపించారు. జడ్పీ సీఈవో వైఖరి అర్థం కావడం లేదని, జడ్పీకి సంబంధించిన నిధులను విడుదల చేయించేందుకు శాసన సభ్యులు చొరవ తీసుకుని కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్, జేసీ ఎం.నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.