ఆదర్శంగా బతకాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 01:04 AM
పదిమందికి ఉపయోగపడేలా ఆదర్శప్రాయంగా బతకాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు ఏఎన్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నటుడు ఏఎన్‌ఆర్ అని తెలిపారు. విద్యాదాతగా ఆయన అమరజీవి అని కొనియాడారు.
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- విశ్వవిద్యాలయంగా ఏఎన్‌ఆర్ కళాశాల అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
- ముగిసిన ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవాలు
గుడివాడ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి):
పదిమందికి ఉపయోగపడేలా ఆదర్శప్రాయంగా బతకాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు ఏఎన్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నటుడు ఏఎన్‌ఆర్ అని తెలిపారు. విద్యాదాతగా ఆయన అమరజీవి అని కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు కృషి ఫలితంగా ఏర్పాటైన ఏఎన్‌ఆర్ కళాశాల ఎందరికో బంగారు భవిష్యత్తును అందించడం గొప్ప విషయమన్నారు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన ఏఎన్‌ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు సంస్కారంతో కూడిన చదువు చెప్పాలన్నారు. విద్య, ఉపాధితో పాటు విజ్ఞానాన్ని నేర్పాలన్నారు. ఏఐ సాంకేతికతతో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనించాలని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఎంతో అవసరమని, నైపుణ్యం లేకుంటే టెక్నాలజీ ఉన్నా ఉపయోగం ఉండదన్నారు. ఇతర భాషలకు ప్రాధాన్యతనిస్తూనే అమ్మ భాషలోనే మాట్లాడాలన్నారు. నాడు మొగలాయులు, బ్రిటీషు పాలకులు భారత చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. భారతీయ దృక్కోణంలో చరిత్రను రాయడంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. మనం ఏ స్థాయికి చేరుకున్న మూలాలను మరచిపోవద్దన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని ఎన్నటికి మరువవద్దని, జై ఆంధ్ర ఉద్యమం నుంచి గుడివాడ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మహానుభావులు పుట్టిన గడ్డ గుడివాడ అని చెప్పారు.
-హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని, దీని కోసం విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
- స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఏఎన్‌ఆర్ కళాశాలను మరింత అభివృద్ధి పరచి, మరో స్థాయిలోకి తీసుకువెళ్లడానికి అందరం కృషి చేద్దామన్నారు. పెద్దలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
- ఏఎన్‌ఆర్ కుమారుడు అక్కినేని వెంకట్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ అభివృద్ధి దేశ ప్రగతికి కీలకమని వ్యాఖ్యానించారు.
-పూర్వ విద్యార్థి సుదర్శన్ బయోటెక్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ రామిరెడ్డి మాట్లాడుతూ కళాశాల చదువు తన విజయానికి మూలమని పేర్కొన్నారు.
- రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏఎన్‌ఆర్ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కళాశాల అభివద్ధికి సహకరించాలని కోరారు.
- కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదుగురు కమిటీ సభ్యుల కృషితో ఏర్పడిన కళాశాల దినదినాభివృద్ధి చెంది, 75 వసంతాలను పూర్తి చేసుకోవడం గర్వ కారణమన్నారు.
-పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్‌రాజా మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నేటికీ కళాశాల అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తోందని కొనియాడారు.
- కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జె.ఎస్.కుమార్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిని వివరించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల సందేశాలను సుభాషిణి చదివి వినిపించారు. కళాశాల చరిత్రను విజిలెన్స్ మాజీ చీఫ్ కమిషనర్ కె.వి.చౌదరి వివరించారు.
ఆవిష్కరణలు
ఏఎన్‌ఆర్ వజ్రోత్సవ పైలాన్, నూతనంగా ప్రవేశపెట్టిన ఇంజినీరింగ్ కళాశాల అకడమిక్ శిలాఫలకం, అక్కినేని ఫౌండేషన్ అమెరికా తరఫున ప్రసాద్ తోటకూర రూపొందించిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల లోగోను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అలాగే రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ చెరుకూరి కిరణ్ కళాశాల సావనీర్‌ను ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. రామోజీరావు పేరిట స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు, డాక్టర్ సూరపనేని శ్రీనివాసరావు, కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ఆర్.కె.ప్రసాద్, కె.ఎస్.అప్పారావు, కోశాధికారి పర్వతనేని కృష్ణప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ బి.ఎస్.ఎస్.పద్మజ, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కొడాలి వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరిగె రామారావు పాల్గొన్నారు.
గుడివాడలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్‌లో ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్య నాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం సేవలను కొనియాడారు. అనంతరం వెంకయ్యనాయుడును నాట్స్ ప్రతినిధులు, ఐఎంఏ గుడివాడ శాఖ సభ్యులు ఘనంగా సత్కరించారు. 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరంలో వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం ఛైర్మన్ డాక్టర్ పిన్నమనేని ప్రశాంత, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఐఎంఏ గుడివాడ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు పాల్గొన్నారు.