గంజాయి రవాణాను అరికట్టాం
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:54 PM
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి దాదాపుగా నివారించగలిగామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు.
పోలీస్ శాఖపై నిందలు వేస్తే సహించం
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కర్నూలు క్రైం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి దాదాపుగా నివారించగలిగామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా పోలీసు డిపార్టుమెంట్‌ను, పోలీసు అధికారులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని.. కొన్ని పత్రికా మాధ్యమాలలో దూషించడం, తప్పుడు కథనాలు రాయడం సరికాదన్నారు. తమపై, పోలీసుశాఖపై వస్తున్న అసత్యప్రచారాలపై స్పందించకపోతే ప్రజలు అవే నిజమని భావిస్తారన్నారు. అందుకే తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. తాను విశాఖపట్నం జిల్లా ఎస్పీగా 2014-16 మధ్య కాలంలో పనిచేశానన్నారు. ఆ సమయంలో విశాఖపట్నం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదన్నారు. నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేదన్నారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపామని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలను ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదని, అందువల్ల గంజాయి రవాణా మార్గాలను టార్గెట్ చేశామన్నారు. అక్కడ పని చేసిన రెండు సంవత్సరాల పాటు లక్ష కిలోల వరకు గంజాయిని జప్తు చేయడం జరిగిందన్నారు. కాకినాడ పోర్టులో డీజిల్ దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని అక్కడ పని చేసే కాలంలో వాటన్నింటినీ అరికట్టడం జరిగిందన్నారు. ఎనఫోర్స్‌మెంటు లేకపోయినా కూడా తమ పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖపై నిందలు వేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఐజీ స్పష్టం చేశారు.