భక్తజన కెరటం
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:58 AM
భవానీ దీక్షల విరమణలో నాలుగో రోజు ఆదివారం ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి శనివారం రాత్రి నుంచే క్యూల్లోకి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాషా్ట్రల నుంచి భవానీలు రైళ్లలో అధిక సంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకు 69 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆ సంఖ్య లక్ష దాటింది.
అర్ధరాత్రి నుంచే దుర్గమ్మ దర్శనం
12 నుంచి 5 గంటల వరకు క్యూలు కిటకిట
పూర్తిగా నిండిపోయిన హోల్డింగ్ పాయింట్లు
ఉదయం 7 గంటలకే 69వేల మందికి దర్శనం
సాయంత్రం 6 గంటలకు 1.22లక్షల మందికి దర్శనం
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
భవానీ దీక్షల విరమణలో నాలుగో రోజు ఆదివారం ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి శనివారం రాత్రి నుంచే క్యూల్లోకి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాషా్ట్రల నుంచి భవానీలు రైళ్లలో అధిక సంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకు 69 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆ సంఖ్య లక్ష దాటింది. సాయంత్రానికి 1,22,954 మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడుపులను విప్పించుకున్నారు. తొలుత భవానీలు రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో శనివారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. స్నానాల ఘాట్లలో జల్లు స్నానాలు చేసిన తర్వాత ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. రాత్రి 11 గంటలకు ఆలయం మూసివేస్తారనగా క్యూల్లోకి ప్రవేశించారు. ఇంద్రకీలాద్రి కొండ మీద నుంచి వినాయకుడి ఆలయం వద్ద ఉన్న పాయింట్ వరకు క్యూలు భక్తులతో నిండిపోవడంతో పోలీసులు హోల్డింగ్ పాయింట్లకు పని చెప్పాల్సి వచ్చింది. వీఎంసీ ఎదురుగా మొదటి హోల్డింగ్ పాయింట్, పూల మార్కెట్ వీధిలో ఏర్పాటు చేసిన రెండో హోల్డింగ్ పాయింట్‌లో మొత్తం 12వేల మంది భవానీలను కంపార్టుమెంట్లలో కూర్చోబెట్టారు. సాధారణంగా తెల్లవారుజామున మూడు గంటలకు భవానీలను దర్శనానికి అనుమతిస్తారు. ఈ సమయానికి దర్శనం ఇస్తే భవానీల రద్దీ మరింతగా పెరుగుతుందని పోలీస్ అధికారులు భావించారు. ఆలయ అధికారులతో మాట్లాడి అర్ధరాత్రి 12 గంటలకే భవానీలను దర్శనానికి అనుమతించేలా చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు ఆలయం మూసివేస్తే గంటలోనే మళ్లీ తలుపులు తెరచి భవానీలను దర్శనానికి అనుమతించారు. 12 గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల్లోపు దర్శనాలు వేగంగా జరగడంతో హోల్డింగ్ పాయింట్లు ఖాళీ అయ్యాయి. సూర్యోదయం నాటికి రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. మామూలుగా వినాయకుడి ఆలయం నుంచి క్యూలో భవానీలు ప్రవేశించారు. భవానీ దీక్షల్లో ఇప్పటి వరకు ఆదివారం ఇంద్రకీలాద్రికి అత్యధికంగా భవానీలు వచ్చారు.