Share News

Water Resources Dept: 2027 డిసెంబరు నాటికి పోలవరం రెడీ

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:55 AM

వచ్చే ఏడాది జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వస్తాయని, 2027 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలు విడుదల చేస్తామని జలవనరుల శాఖ ధీమా వ్యక్తం చేసింది.

Water Resources Dept: 2027 డిసెంబరు నాటికి పోలవరం రెడీ

  • వచ్చే జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి

  • సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ నోట్‌

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వస్తాయని, 2027 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలు విడుదల చేస్తామని జలవనరుల శాఖ ధీమా వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులపై సమగ్ర సమాచారంతో కూడిన నోట్‌ను ఆ శాఖ.. సీఎం చంద్రబాబుకు అందజేసింది. 194.8 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో, 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా.. పశ్చిమ గోదావరి జల్లా రామయ్యపేట వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ఓవరాల్‌గా 57.51 శాతం పూర్తయినట్టు ఆ నోట్‌లో వివరించింది. ఇందులో సివిల్‌ వర్క్స్‌ 86.10 శాతం.. భూసేకరణ, సహాయ పునరావాసం పనులు 25.50 శాతం వరకు పూర్తి చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే 80 టీఎంసీల గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదిలోకి పంపిస్తున్నామంది. ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్‌వే, 48 రేడియల్‌ గేట్ల బిగింపు, పవర్‌హౌస్‌ తవ్వకం, గ్యాప్‌-3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులు 100 శాతం పూర్తయ్యాయని చెప్పింది. స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని పేర్కొంది. ఇప్పటికే డయాఫ్రమ్‌వాల్‌ పూర్తయిందని, 2020 నాటి వరదలకు ఈ వాల్‌ దెబ్బతినడంతో సమాంతర గోడ నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపింది. కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ పనులు 55 శాతం పూర్తయ్యాయని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ పనులు పూర్తిచేస్తామంది. శాండ్‌ రీచ్‌ పూర్తయిందని, భూమి చదును పనులు జరుగుతున్నాయని, డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ పనులు ప్రారంభించాల్సి ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2024-25లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ 5,052.71 కోట్లు విడుదలయ్యాయని తెలిపింది. ప్రాజెక్టు కోసం ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.24,824 కోట్లు ఖర్చయ్యాయని తెలిపింది.

Updated Date - Sep 28 , 2025 | 03:57 AM