Share News

Water Resources Department: జలవనరుల శాఖ ఖాళీ

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:07 AM

కొత్త సంవత్సరంలో జల వనరుల శాఖ ఖాళీ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి నుంచి డిసెంబరు దాకా 77 మంది ఇంజనీరింగ్‌ అధికారులు పదవీ విరమణ చేయనున్నట్లు...

Water Resources Department: జలవనరుల శాఖ ఖాళీ

  • కొత్త ఏడాదిలో 77 మంది ఇంజనీర్లకు వీడ్కోలు!

  • ఉద్యోగ నియామకాలు జరగక విలవిల

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో జల వనరుల శాఖ ఖాళీ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి నుంచి డిసెంబరు దాకా 77 మంది ఇంజనీరింగ్‌ అధికారులు పదవీ విరమణ చేయనున్నట్లు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వు జారీచేశారు. గడచిన కొన్నేళ్లుగా ఈ శాఖలో లస్కర్‌ మొదలుకొని డిప్యూటీ ఇంజనీర్‌, జూనియర్‌ ఇంజనీర్‌ల నియామకాలూ చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు ఇంజనీర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) నుంచి ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) వరకు అదనపు బాధ్యతలతో అధికారులు 2-3 బాధ్యతలను ఏకకాలంలో ఏళ్లతరబడి నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖలో పూర్తి అదనపు బాధ్యతలు పేరిట అడ్‌హాక్‌ ప్రమోషన్లే తప్ప రెగ్యులర్‌ ప్రమోషన్లు లేకుండా పోయాయి. అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాల నిర్మాణ పర్యవేక్షణంతా పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్లే చేయాల్సి వస్తోంది. విజయవాడ ఇరిగేషన్‌ కార్యాలయంలో ఈఎన్‌సీగా ఉన్న అధికారి పోలవరం పాజెక్టు ఈఎన్‌సీగా నిర్మాణ పనులు చూడాల్సి వస్తోంది.

Updated Date - Dec 31 , 2025 | 05:10 AM