జలం.. పుష్కలం
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:30 AM
జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. రూ.344.05 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను మంజూరు చేశాయి. నందిగామ, కొండపల్లి, తిరువూరు మున్సిపాల్టీలకు ఆసియా పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంక్ (ఏఐఐబీ), కేంద్ర ప్రభుత్వ అమృత పథకాల ద్వారా నిధులు విడుదలయ్యాయి. తలసరి నీటి వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు ఈ పథకాలు దోహదపడనున్నాయి.
-రూ.344.05 కోట్ల వ్యయంతో జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులు
-నందిగామ, కొండపల్లి, తిరువూరు మున్సిపాల్టీల్లో నీటి సమస్యకు చెక్
-ఏఐఐబీ, అమృత పథకాల ద్వారా త్వరలో చేపట్టనున్న పనులు
-తీరనున్న ప్రజల తాగునీటి ఇబ్బందులు
జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. రూ.344.05 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను మంజూరు చేశాయి. నందిగామ, కొండపల్లి, తిరువూరు మున్సిపాల్టీలకు ఆసియా పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంక్ (ఏఐఐబీ), కేంద్ర ప్రభుత్వ అమృత పథకాల ద్వారా నిధులు విడుదలయ్యాయి. తలసరి నీటి వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు ఈ పథకాలు దోహదపడనున్నాయి.
(ఆంధ్రజ్యోతి, నందిగామ):
నందిగామ, కొండపల్లి, తిరువూరు పురపాలక సంఘాల్లో దశాబ్దాల కాలం నాటి పథకాల ద్వారా నేటికీ మంచినీరు సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో జనాభా మూడు రెట్లు పెరిగినా పాత పథకాలతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర నీటిని విడతల వారీగా సరఫరా చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మూడు రోజులకోమారు కూడా ప్రజలకు మంచినీరు సరఫరా కావడం లేదు. వేసవిలో కనీసం వాడకానికి కూడా చుక్కనీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. నందిగామ, కొండపల్లి మున్సిపాల్టీలకు కృష్ణా, మునేరు నదులు అతి దగ్గరలో ఉన్నప్పటికీ భూగర్భ జలాలు తగ్గి నీటి సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో వైపు జనాభా పెరుగుదలతో పట్టణాల విస్తరణ కూడా మరింత జరిగింది. విస్తరించిన ప్రాంతాలకు పైపులైన్లు వేయలేక ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పాతకాలం నాటి పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురి కావడంతో సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేయలేకపోతున్నారు. అప్పటి పైపులైన్లు ఇప్పుడు డ్రెయిన్‌ల పక్కన ఉండడం వల్ల లీకులు ఏర్పడి పలుమార్లు మురుగు నీరు సరఫరా అయ్యాయి. దీంతో అంటు వ్యాధులు ప్రబలిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేసవి రాగానే మంచినీటి పథకాలకు నీరు అందకపోవడం, మరమ్మతులతో నీటి సరఫరా రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరుతున్న ఈ పథకాల వినియోగం కోసం మునిసిపల్ నిధులు పెద్దయెత్తున వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మంజూరైన మంచినీటి పథకాల నిర్మాణం పూర్తయితే ఈ మూడు మున్సిపాల్టీల ప్రజలు మినరల్ వాటర్ బాటిళ్ల కంటే అత్యంత శుద్ధితో కూడిన నీటిని అందుకోనున్నారు. కేవలం తాగునీరే కాకుండా సాధారణ వినియోగానికి కూడా ఈ నీటినే వినియోగించే అవకాశం ఉంది. మొదటి ఏడు సంవత్సరాల పాటు పథకాలు నిర్మించిన కాంట్రాక్టర్లే నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. దీని వల్ల నిర్మాణ లోపాలను వారే సరి చేస్తారు. దీని వల్ల మున్సిపాల్టీలపై ఆర్థిక భారం పడదు.
నందిగామకు రూ.103 కోట్లు మంజూరు
నందిగామ మున్సిపాల్టీలో 55 వేల జనాభా ఉంది. పరిసర గ్రామాల నుంచి నిత్యం పది వేల మంది వరకూ వచ్చి వెళుతుంటారు. దీంతో మొత్తం 65 వేల మంది జనాభా లెక్కన ప్రతి ఒక్కరికీ 135 లీటర్ల నీటిని అందించేందుకు రూ.103 కోట్లతో ఏఐఐబీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. కృష్ణానదిపై గుడిమెట్ల వద్ద నిర్మించే ఈ పథకం ద్వారా 18 కిలో మీటర్ల మేర నీరు ప్రవహించి నందిగామ పట్టణంలోని అనాసాగర వద్ద ఏర్పాటు చేసిన ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు 12.5 మిలియన్ లీటర్ల నీరు చేరుతుంది. అత్యాఽధునిక విధానంతో ఇక్కడ నీటిని శుద్ధి చేసి పట్టణంలో ఏర్పాటు చేయనున్న నాలుగు ట్యాంక్‌లకు చేరుస్తారు. వీటి సామర్థ్యం 3800 కిలో లీటర్లు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇంటింటికీ నీటిని అందించనున్నారు. ఇందు కోసం పట్టణంలో 4500 కుళాయిలను ఇంటింటికీ ఇవ్వనున్నారు. నలబై కిలో మీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట ్టనున్నారు. వాస్తవానికి విస్తరించి ఉన్న నందిగామ పట్టణంలో 103 కిలో మీటర్ల మేర పైపులైన్ వేయాల్సి ఉంది. ఈ పథకం ద్వారా నలభై కిలోమీటర్ల వేస్తున్నారు. పాత పైపులైన్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన 24 కిలో మీటర్ల పైపులైన్ మాత్రమే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. పురాతన కాలం నాటి సిమెంట్ పైపులైన్ ద్వారా నీటి పంపిణీ సురక్షితం కాదని, వాటి స్థానంలో కొత్త పైపులైన్ వేయాల్సి ఉంది. ఇందు కోసం ప్రాజెక్ట్ అంచనా రూ.8.5 కోట్ల మేర పెంచాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అలా చేస్తే పట్టణంలోని అన్ని ప్రాంతాలకూ సమర్థవంతంగా నిరంతరాయ నీటి సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. ఈ పథకం పూర్తయితే 2050 నాటికి పెరగనున్న జనాభాకు కూడా తలకు 135 లీటర్ల నీరు అందించే అవకాశం ఉంది.
కొండపల్లిలో రూ.57.15 లక్షలతో ఏర్పాటు
కొండపల్లి మున్సిపాల్టీకి ఇప్పటికే పురా పథకం ద్వారా మంచి నీరు సరఫరా అవుతుంది. పట్టణ జనాభా 71 వేలపైనే ఉంది. ఈ మున్సిపాల్టీకి అమృత పథకం ద్వారా రూ.57.15 లక్షలతో ఫెర్రీ వద్ద పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి 2.9 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని వీటీపీఎస్ సమీపంలో ఏర్పాటు చేయనున్న నీటిశుద్ధి పథకానికి చేరుస్తారు. అక్కడి నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు ట్యాంకుల ద్వారా కుళాయిలకు సరఫరా చేయనున్నారు. మొత్తం 4100 కిలో లీటర్ల నీటిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పట్టణంలో యాభై కిలో మీటర్ల మేర అంతర్గత పైపులైన్ ఉండగా, కొత్త పథకం కింద 46 కిలో మీటర్ల పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తారు. కొండపల్లి పట్టణ విస్తీర్ణం, స్వరూపం ఆధారంగా మొత్తం 164 కిలో మీటర్ల మేర పైపులైన్ వేస్తేనే ఇంటింటికీ కుళాయి ఇచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయ పడుతు న్నారు. ఇందు కోసం మరో రూ.15 కోట్ల అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. పైపులైన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి పట్టణంలో 12,200 ట్యాప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇదే పనిలో భాగంగా అసంపూర్ణంగా నిలిచి ఉన్న పాత పుర పథకం పనులు కూడా పూర్తి చేసి పూర్తి సామర్థ్యంతో పని చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ. 240.48 కోట్లతో తిరువూరులో రక్షిత మంచినీటి వ్యవస్థ
తిరువూరు మున్సిపాల్టీకి సంబంధించిన ఏఐఐబీ ద్వారా రూ.240.48 కోట్లతో మంచినీటి పథకం ఫెర్రీ వద్ద నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 75 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా తిరువూరులో ఏర్పాటు చేసే నీటిశుద్ధి కేంద్రానికి చేరుస్తారు. మొత్తం 9 ఎంఎల్‌డీ లీటర్ల నీరు తిరువూరు చేరనుంది. అక్కడ ఏర్పాటు చేసే నాలుగు ట్యాంక్‌ల ద్వారా 3000 కేఎల్‌డీ నీటిని సరఫరా చేయనున్నారు. పట్టణంలో మొత్తం కుళాయిలు ఏర్పాటు చేయాలంటే 144 కిలో మీటర్ల పైపులైన్ అవసరం ఉంది. ఈ పథకంలో 87 కిలోమీటర్లు వేయనున్నారు. పట్టణంలో కేవలం 15 కిలో మీటర్ల మేర మాత్రమే పటిష్టమైన పైపులైన్ ఉంది. దీని ప్రకారం ఇక్కడ కూడా మరో 42 కిలో మీటర్ల పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం అదనంగా రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. తిరువూరులో 4600 కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ నీటిని అందిస్తారు.