‘జల’మయం!
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:47 AM
జిల్లాలో కుండపోతగా వర్షం పడింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రహదారులపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. ప్రధాన డ్రెయిన్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల వరిపైరు నేలవాలింది. బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కోస్తాతీరం వెంబడి ఈ నెల 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు, 28వ తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
- జిల్లాలో కుండపోత వర్షం
- కాలనీలు, లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టిన నీరు
- రహదారులపై మోకాలి లోతు ప్రవాహం
- నేలవారిన వరి పొలాలు
- కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో కుండపోతగా వర్షం పడింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రహదారులపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. ప్రధాన డ్రెయిన్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల వరిపైరు నేలవాలింది. బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కోస్తాతీరం వెంబడి ఈ నెల 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు, 28వ తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో గురువారం భారీ వర్షం పడింది. ఉదయం 8.30 గంటల వరకు మచిలీపట్నంలో అత్యధికంగా 112.6 మిల్లీమీటర్లు, పెదపారుపూడిలో అత్యల్పంగా 11.0 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 34.6 మిల్లీమీటర్లుగా ఉంది. సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నాగాయలంకలో 76.8 మిల్లీమీటర్లు, బంటుమిల్లిలో 56.2, ఘంటసాలలో 54.2, గుడ్లవల్లేరులో 46.4, మొవ్వలో 44.8, చల్లపల్లిలో 40.2, అవనిగడ్డలో 38.2 మోపిదేవిలో 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 25 మిల్లీమీటర్ల కంటే తక్కువగా వర్షం పడింది.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో 08672 252572 నెంబరుతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటికపుడు ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిస్థితులను అంచనా వేసి సమాచారం తెలియజే యాలని కలెక్టర్ బాలాజీ ఆదేశాలు జారీ చేశారు.
వరి పొలాలకు చేటు!
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. గురువారం భారీవర్షం విరామం లేకుండా పడింది. దీంతో ఈత, కంకులు పాలుపోసుకునే దశలో ఉండటంతో కంకుల సుంకు రాలిపోతుందని, దీని ప్రభావంతో గింజలు పాలుపోసుకోవని, వరి కంకుల్లో తప్ప, తాలు శాతం పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది దిగుబడులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక వరికి తెగుళ్లు, దోమపోటు అధికమవుతుందని చెబుతున్నారు. ముతక రకాలైన ఎంటీఎం-1061, 1077, 1318, 1262 రకాలకు సంబంధించిన ఈత దశలో ఉన్న వరిపైరు ఏపుగా ఎదిగింది. వర్షం కారణంగా కంకులు బరువెక్కి నిదానంగా పైరు నేలవాలుతుంది. ఇలా వాలిపోయిన వరిపైరు రెండు రోజులకు పైబడి నీటిలోనే ఉండిపోతే కంకులు, పైరు కుళ్లిపోతాయి. బీపీటీ-5204 వంటి సన్నరకాల వరిపైరు దుబ్బులు సున్నితంగా ఉండటంతో ఈరకం పైరు కంకుల బరువు కారణంగా త్వరితగతిన నేలవాలుతుందని రైతులు చెబుతున్నారు. కోతకు సిద్ధమైన సన్నరకాల ధాన్యం నేలవాలితే గింజలు నీటిలోనే ఉండిపోయి మొలకెత్తే ప్రమాదం లేకపోలేదని రైతులు భయపడుతున్నారు.
కాల్వలను తలపించిన ప్రధాన రహదారులు
మచిలీపట్నంలో భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారితో పాటు బస్టాండ్ ఆవరణ, మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి వెళ్లే రహదారులపై మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు భారీగా చేరింది. గుడివాడ బస్టాండ్, ధనియాలపేట, కోతిబొమ్మ సెంటర్‌తో పాటు నగరంలోని రహదారులన్నింటిపై వర్షపు నీరు ప్రవహించింది. అవనిగడ్డ, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు పెద్దఎత్తున చేరడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురుస్తూనే ఉండటంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.