తుంగభద్రకు జలకళ
ABN , Publish Date - May 20 , 2025 | 12:08 AM
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న తుంగభద్ర నది వేసవిలో జలకళ సంతరించుకుంది.
ఆనందంలో రైతులు, భక్తులు
తాగునీటి కష్టాలు తీరాయన్న అధికారులు
మంత్రాలయం వద్ద 308.300 నీటి మట్టం నమోదు
మంత్రాలయం, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న తుంగభద్ర నది వేసవిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం రాత్రి వరకు ప్రవాహం లేని తుంగభద్ర నది సోమవారం ఉదయానికల్లా ప్రవాహం నిండుగా ప్రవహిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటకలోని గంగావతి, సిరిగుప్ప, సిందనూరు, మాన్వి, హగరిలో కురిసిన వర్షాలకు తుంగభద్ర నదిలోకి వంకలు, వాగుల ద్వారా వరద వచ్చి చేరుతోంది. వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులున్న పరిస్థితుల్లో రెండు మీటర్లకు పైగా నదిలో నీటి ప్రవాహం ఉండటంతో తాగునీటికి ఇబ్బందులు తీరినట్లయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మంత్రాలయం వద్ద 308.16 మీటర్ల నీటి మట్టంతో 17,300 క్యూసెక్కులు నీటితో ప్రవహిస్తుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 306.470 మీటర్ల నీటి మట్టంతో వెయ్యి క్యూసెక్కులు మాత్రమే ఉండేది. సోమవారం ఉదయం కల్లా 17వేలకు పైగా క్యూసెక్కులు వచ్చి చేరడంతో నదితీర గ్రామాల్లోని రైతులు రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మార్చి ఏప్రిల్, మే నెలల్లో నీరు లేక ఎడారిగా మారిన తుంగభద్ర జలకళను సంతరించుకోవడంతో నదితీర గ్రామాల రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధం అవుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని భక్తులు మంత్రాలయానికి పుట్టీ(తెప్ప)ల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, అలాగే సి.బెళగల్, గూడూరు, సుంకేసుల కర్నూలు వరకు తాగునీటి పథకాలు పునఃప్రారంభమయ్యాయి.
ఫ తాగునీటి సమస్య పరిష్కారమైంది
- పద్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, ఆదోని
తుంగభద్రకు వర్షం నీరు రావడంతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఊహించని సమయంలో తాగునీటికి ఇబ్బందులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే సమయంలో ఎగువ ప్రాంతాల్లో వర్షం నీరు తుంగభద్ర నదికి నీరు నిండుగా ప్రవహిస్తుండటం శుభపరిణామం. నదితీర గ్రామాల్లో దాదాపు తాగునీటి సమస్య పరిష్కారమైనట్లే. రెండు నెలలుగా నీరు లేక నిలిచిపోయిన తాగునీటి పథకాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో దాహార్తి తీరుతుంది.