AP Govt: చెత్త కూడా సంపదే
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:38 AM
చెత్తే కదా అని పారేయవద్దు... వ్యర్థాలూ సంపదేనని గుర్తించాలంటూ పారిశ్రామికవేత్తలను, వర్తక, వాణిజ్య సంస్థలను రాష్ట్రప్రభుత్వం కోరుతోంది.
వ్యర్థాల సక్రమ నిర్వహణకు ప్రోత్సాహకాలు
వేస్ట్ రీసైక్లింగ్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): చెత్తే కదా అని పారేయవద్దు... వ్యర్థాలూ సంపదేనని గుర్తించాలంటూ పారిశ్రామికవేత్తలను, వర్తక, వాణిజ్య సంస్థలను రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. వ్యర్థాలనిర్వహణను ఒక వాణిజ్య విధానంగానే పరిగణించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ’’ఏపీ సర్క్యులేషన్ ఎకానమీ- వేస్ట్ రీసైక్లింగ్ 4.ఓ’’ పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీకి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సాధారణంగా పారిశ్రామికవ్యర్థాల నిర్వహణపై అలసత్వం వహించే సంస్థలకు అపరాధ రుసుం విధిస్తుంటారు. తాజాగా ప్రభుత్వం రూటు మార్చి.. చక్కని నిర్వహణ చేపట్టిన యాజమాన్యాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది. పాలసీలో ఇందుకు సంబంధించిన అంశాలను పొందుపరిచింది. పారిశ్రామిక, వ్యవసాయ, పశు వ్యర్థాల యాజమాన్య నిర్వహణపై ఈ పాలసీలో ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని పెద్ద పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తికి పనికిరాని ప్లాస్టిక్, ఇనుపరేకులు, ఆయిల్స్‌ను బహిరంగ ప్రదేశంలో డంప్ చేస్తున్నాయి. వినియోగించని వ్యవసాయోత్పత్తులను బహిరంగప్రదేశాల్లో పారబోస్తున్నారు. అవి కుళ్లిపోయి, దుర్గంధాన్ని వెదజల్లడంతోపాటు రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. కబేళాలు .. పౌల్ర్టీ యాజమాన్యాలు వ్యర్థాలను చెరువుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ పారబోస్తున్నాయి. అదేగనుక వ్యర్థాలను ఒకచోటకు చేర్చి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తయారుచేయడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చునని యాజమాన్యాలకు సూచించనున్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. వ్యర్థాలను డంప్ చేసేందుకుగాను దీర్ఘకాలానికి చౌకగా భూములను లీజులకు ఇవ్వాలని నిర్ణయించింది. భూములను తక్కువ ధరకు లీజులకు ఇవ్వడం వల్ల .. పారిశ్రామిక, ప్రైవేటు వ్యక్తులు కూడా వ్యర్థాల నిర్వహణకు ముందుకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పాలసీలో భాగంగా, పారిశ్రామిక వ్యర్థాల యాజమాన్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ ’’ రేటింగ్ ’’లను ప్రభుత్వం ఇవ్వనుంది. హరిత ట్యాగ్‌లను అందిస్తుంది. వీటి ఆధారంగానే ప్రోత్సాహకాలు కల్పిస్తారు.