మెరుగైన పాలనకు వార్డుల విభజన ఉండాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:43 PM
రాజకీయాలకు అతీతంగా మెరుగైన పరిపాలన అందించే విధంగానే వార్డుల విభజన ఉండాలని మెజార్టీ కౌన్సిలర్లు సూచించారు.
మెజార్టీ కౌన్సిలర్లు సూచన
కౌన్సిల్ సభలో వార్డుల పునర్విభజనపై రచ్చ
మున్సిపల్ వార్డుల పెంపు తీర్మానం వాయిదా
ఆత్మకూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా మెరుగైన పరిపాలన అందించే విధంగానే వార్డుల విభజన ఉండాలని మెజార్టీ కౌన్సిలర్లు సూచించారు. మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన డాక్టర్ మారూఫ్ ఆసియా అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పట్టణంలో ఉన్న 24వార్డులను 28వార్డులుగా పునర్విభజన చేసే అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరిని సంప్రదించి వార్డుల విభజన చేశారని, అడ్డగోలుగా వార్డుల విభజన ఉందంటూ వైసీపీకి చెందిన కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకే కాలనీలో పక్కపక్కన, ఎదురెదురు నివాసం ఉంటే ఇళ్లను సైతం వేర్వేరు వార్డుల్లో ఉంచారని, కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఓటర్లను వేర్వేరు జాబితాలో మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిని పరిష్కరించకుండా వార్డుల పునర్విభజన ఏవిధంగా చేస్తారని సభ్యులు నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా మెరుగైన పరిపాలన అందించే విధంగానే వార్డుల విభజన ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు మాట్లాడుతూ.. 2011 డిసెంబరు 28న ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ నగర పంచాయతీగా రూపాంతరం చెందిందన్నారు. ఆ తర్వాత 2019 జూలై 24న గ్రేడ్-3 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చెందిందని అన్నారు. జనాభా పెరుగుదల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 24వార్డులను 28వార్డులుగా మార్చాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. పేపర్ ప్రకటన ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలు కోరినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. రెండు కౌన్సిల్ సభల్లో ఈ తీర్మానం ఆమోదం పొందకపోతే ఆతర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన డాక్టర్ మారూఫ్ ఆసియా మాట్లాడుతూ మరొకసారి వార్డు పునర్విభజన అంశాన్ని పరిశీలించాలని, అప్పటివరకు తీర్మానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇతరును ఏవిధంగా అనుమతించారు?
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు పునర్విభజన అంశంపై చర్చ జరుగుతుండగా టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా సభలోకి వచ్చి వెనుక ఉండే కుర్చీల్లో కూర్చుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన డాక్టర్ మారూఫ్ ఆసియా కౌన్సిల్ సభలోకి ఇతరులను ఏవిధంగా అనుమతిస్తారంటూ మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ స్పందిస్తూ.. కౌన్సిల్ సభలను వీక్షించేందుకు పబ్లిక్‌కు అవకాశం ఉంటుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో సైతం పబ్లిక్ గ్యాలరీ ఉంటుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.