వార్ సైరన
ABN , Publish Date - May 07 , 2025 | 11:24 PM
పహల్గాం ఉగ్రదాడితో భారత-పాకిస్థాన మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి.
జిల్లా వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్
‘ఆపరేషన అభ్యాస్’ పేరిట అవగాహన
ఎస్పీ, జేసీ అత్యవసర సమావేశం
ధైర్యంగా ఉండాలని ప్రజలకు పిలుపు
కర్నూలు న్యూసిటీ, మే 7(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడితో భారత-పాకిస్థాన మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత ‘ఆపరేషన సింధూర్’ పేరిట మెరుపుదాడులతో దాయాది పాకిస్థానకు గట్టి సమాధానమే ఇచ్చింది. ఈ క్రమంలో భారత-పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. యుద్ధం వస్తే ప్రజలంతా తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే విషయంలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం సివిల్ మాక్ డ్రిల్ కొనసాగింది. ‘ఆపరేషన అభ్యాస్’ పేరిట చేపట్టిన ఈ మాక్ డ్రిల్ జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. శత్రు దేశం పాకిస్థాన నుంచి యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల భద్రత కోసం కేంద్రం ఈ మాక్ డ్రిల్‌కు పిలుపునిచ్చింది. ఇందులో అత్యంత కీలకమైనది సైరన. అధికారులు సైరన మోగించి మాక్‌డ్రిల్‌ను ప్రారంభించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైరన మోతలు వినిపించాయి. ఇదిలా ఉండగా 50 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో ఇలాంటి మాక్‌డ్రిల్ నిర్వహించారు. అది కూడా దేశ సరిహద్ధులో ఉన్న జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన, గుజరాత వంటి సరిహద్దు రాషా్ట్రల్లోకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా యుద్ధ సైరన మోగింది.
కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద సాయంత్రం 4 గంటలకు ప్రయోగాత్మకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. మినిసీ్ట్ర ఆఫ్ హోమ్ ఆఫైర్స్ ద్వారా జారీ చేసి ఎస్‌ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ చేసే ముందు ప్రజలకు భయాందోళనలకు గురికాకుండా వార్ సైరన మోగించి సమాచారం అందించారు. సైర్ మోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రదేశంలోకి వెళ్లే విధంగా సూచనలు ఇచ్చి చైతన్య పరిచారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు క్షుణ్ణంగా వివరించారు. సంక్షోభ, యుద్ధ సమయంలో పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్‌లో పోలీసులు, రక్షణ శాఖ, ఆర్మీ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, సివిల్ డిఫెన్స వార్డెన్లు, హోంగార్డులు, ఎనసీసీ కోర్, ఎస్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎనవైకే సంఘటన, కళాశాలలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర పాలక కమిషనర్ మాట్లాడుతూ పాకిస్థానతో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రాణాలను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ అనుపమ, అర్బన తహసీల్దారు వెంకటలక్ష్మి సూచనలు చేశారు. సీఐలు రామయ్యనాయుడు, నాగరాజరావు, మన్సూరుద్దీనలు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, డిప్యూటి ఇన్సపెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.