రవాణశాఖలో వార్!
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:07 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రవాణాశాఖలోని ఏఎంవీఐ, ఎంవీఐ మధ్య కొన్నాళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఎంవీఐలకు పనిలేకుండా పోయింది. దీంతో అవినీతికి అలవాటు పడిన పలువురు ఎంవీఐలు ఏఎంవీఐ విధుల్లో తలదూర్చి లైసెన్స్‌ల మంజూరు తదితర వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. వీరిక్ని కొందరు ఆర్‌జేటీసీ, జేటీసీలు అండగా నిలుస్తున్నారు. దీంతో ఎంవీఐల తీరుతో విసిగిపోయిన ఏఎంవీఐలు కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
- ఏఎంవీఐ వర్సెస్ ఎంవీఐ
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో నడుస్తోన్న వివాదం
- ఏఎంవీఐల విధుల్లో తలదూర్చుతున్న పలువురు ఎంవీఐలు
- లైసెన్స్‌ల మంజూరులో అవినీతికి పాల్పడుతున్న వైనం
- వీరికి అండగా నిలుస్తున్న కొందరు ఆర్‌జేటీసీ, జేటీసీలు
- కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న ఏఎంవీఐలు
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రవాణాశాఖలోని ఏఎంవీఐ, ఎంవీఐ మధ్య కొన్నాళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఎంవీఐలకు పనిలేకుండా పోయింది. దీంతో అవినీతికి అలవాటు పడిన పలువురు ఎంవీఐలు ఏఎంవీఐ విధుల్లో తలదూర్చి లైసెన్స్‌ల మంజూరు తదితర వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. వీరిక్ని కొందరు ఆర్‌జేటీసీ, జేటీసీలు అండగా నిలుస్తున్నారు. దీంతో ఎంవీఐల తీరుతో విసిగిపోయిన ఏఎంవీఐలు కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రవాణా శాఖలో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ), సహాయ మోటార్ ఇన్‌స్పెక్టర్ల మధ్య వార్ నడుస్తోంది. ఏఎంవీఐల విఽధుల్లో పలువురు సీనియర్ ఎంవీఐలు తలదూర్చటమే దీనికి కారణంగా తెలుస్తోంది. రవాణా వ్యవస్థలో మోటార్ వె హికల్ ఇన్‌స్పెక్టర్ల పాత్రను గణనీయంగా తగ్గించేందుకు కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న అనేక సంస్కరణల వల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంవీఐలు నిర్వహించాల్సిన విధులు చాలా వరకు తగ్గిపోయాయి. వాహనాల రిజిస్ర్టేషన్లు, వాహనాల బ్రేక్ వ్యవహారాలు, ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించటం, ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయటం, రవాణా వాహనాల మీద కేసులు రాయటం, ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తి చేయటం ఎంవీఐలు ప్రధానంగా నిర్వహించేవారు. అలాగే గతంలో చెక్ పోస్టుల పరిధిలో కూడా విధులు నిర్వహించేవారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ (ఏటీఎస్) పేరుతో ప్రైవేటు కేంద్రాల ద్వారా వాహన బ్రేక్, ఫిట్‌నెన్‌లు వంటి బాధ్యతలను ప్రైవేటు నిర్వాహకుల చేతుల్లో ఉన్న ఏటీఎస్ కేంద్రాలకు అప్పగించింది. దీంతో ఎంవీఐల ప్రధానమైన బాధ్యతలను వారు నిర్వర్తించనవసరం లేకుండా పోయింది. దీంతో పాటు అంతే ప్రధానమైన వాహన రిజిస్ర్టేషన్లను కూడా అంతకు ముందే వాహన షోరూమ్‌లకు అప్పగించటం జరిగింది. టెంపరరీ రిజిస్ర్టేషన్, పర్మినెంట్ రిజిస్ర్టేషన్, నెంబర్ ప్లేట్ రిజ్రిస్టేషన్ వంటివి అక్కడే జరిగిపోతున్నాయి. అలాగే చెక్‌పోస్టులను కూడా కేంద్రం రద్దు చేసింది. దీంతో గతంలో మాదిరిగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సింహభాగం ప్రధానమైన విధులను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ రకమైన విధులు గతంలో కొందరు అవినీతి ఎంవీఐలకు కాసులు కురిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో అవినీతి రుచి మరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలువురు సీనియర్ ఎంవీఐలు.. తమ కింద కేటగిరీ అయిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ (ఏఎంవీఐ) విధుల్లో తలదూర్చుతున్నారు. ఏఎంవీఐల ప్రధానమైన విధుల విషయానికి వస్తే .. రిజిస్ర్టేషన్ల రెన్యువల్స్, లెర్నర్ లైసెన్స్‌లు, ఫ్రెష్ లైసెన్స్‌ల వంటి బాధ్యతలను నిర్వహిస్తుంటారు. అయితే అధికారం ఉందన్న కారణంగా అవినీతికి అలవాటుపడిన సీనియర్ ఎంవీఐలు కొందరు ఏఎంవీఐల బాధ్యతలను లాగేసుకుంటున్నారు. కాసులను పిండుకునే కార్యక్రమాలకు తెర తీస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్న సీనియర్ ఎంవీఐలలో ఎక్కువ మంది ప్రస్తుతం ఇదే పని చేస్తున్నారు. దీంతో సీనియర్ ఎంవీఐలు, ఏఎంవీఐల మధ్య యుద్ధ జరుగుతోంది. ఉన్నతాధికారుల స్థాయిలో పంచాయితీలు నడుస్తున్నాయి.
ఉన్నతాధికారుల అండ చూసుకుని..
సీనియర్ ఎంవీఐలు కొందరు తమ పైఅధికారులు అయిన ఆర్‌జేటీసీ, జేటీసీల అండ చూసుకుని ఏఎంవీఐల విధుల్లో తలదూర్చుతూ, విచ్చలవిడిగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఏఎంవీఐలు పైఅధికారులకు చెప్పుకుందామంటే వారంతా కూడా ఎంవీఐలకు మద్దతుగా ఉంటున్నారని తెలిసింది. ఈ వ్యవహారాలేవీ రవాణా శాఖ కమిషనర్‌కు తెలియకపోవటంతో ఏఎంవీఐలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానమైన బాధ్యతలు లేకపోయినప్పటికీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ చేసే అధికారం ఇప్పటికీ ఎంవీఐల చేతుల్లోనే ఉంది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తూ నిబంధనల ఉల్లంఘనలు జరిగితే జరిమానాలు వేయవచ్చు. ఈ పనిని ఎంవీఐలు పెద్దగా చేయటం లేదని విమర్శలు వస్తున్నాయి.
వాహన సదుపాయం లేక అవస్థలు
మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు వాహన సదుపాయం ఉంది. ఏఎంవీలకు మాత్రం కార్లు లేవు. ఇటీవల ఏఎంవీఐలు అంతా కలిసి ప్రభుత్వ స్థాయిలో ఓ ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి వాహన సదుపాయం కల్పించాల్సిందిగా కోరారు. చట్ట ప్రకారం మీకు వాహన సదుపాయం లేదని, అయినప్పటికీ రూ.20 లక్షలు ఇచ్చుకుంటే మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తానని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఏఎంవీఐలు ఉలిక్కిపడి తిరుగుటపా కట్టారు. తమను రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ స్థాయి ఉన్నతాధికారి వ్యవహారంపై రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని భావించినా... ఆ తర్వాత వారు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.