CBI: వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:27 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ: సీబీఐ
వేరే కోర్టులో ఉన్న సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది లూథ్రా
మరో రోజు విచారిస్తామన్న ధర్మాసనం
తదుపరి విచారణ 19కి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, గంగిరెడ్డి తదితరుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి, సీబీఐ దాఖలు చేసిన అన్ని పిటిషన్లనూ కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా సీబీఐకి మూడు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తోందా.. రాష్ట్రప్రభుత్వం కడప కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై దాని అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా.. అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, దానిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లు మంగళవారం మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది. పిటిషనర్ సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరో కోర్టులో ఉన్నారని, సమయం ఇవ్వాలని ఆమె తరఫున మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అనంతరం.. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని లూథ్రా తెలిపారు. అయితే మధ్యాహ్నం తర్వాత తమ బెంచ్ విచారణ చేపట్టదని.. అందుచేత మరో రోజు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.