Accused Sunil Yadav: వివేకా హత్య కేసులో..తదుపరి దర్యాప్తు జరపాల్సిందే
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:35 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలనం చోటు చేసుకుంది. కేసులో అసలు వాస్తవాలు బయటకు వచ్చేందుకు తదుపరి దర్యాప్తు చేపట్టేలా సీబీఐకి ఆదేశాలు...
ఏ-2 సునీల్ యాదవ్ సంచలన కౌంటర్
సునీతారెడ్డి పిటిషన్‌పై దాఖలు
వివేకా సంబంధాలు, అవినాశ్‌రెడ్డితో
కక్షలను దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదు
ఎన్‌ఐఏ సాయంతో పూర్తిస్థాయి
దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి: సునీల్
హైదరాబాద్, కడప, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలనం చోటు చేసుకుంది. కేసులో అసలు వాస్తవాలు బయటకు వచ్చేందుకు తదుపరి దర్యాప్తు చేపట్టేలా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలని ఏ-2 సునీల్ యాదవ్ మంగళవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదే కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. కౌంటర్ వేయాలని నిందితులందరికీ నోటీసులు జారీచేయడం తెలిసిందే. మిగతా నిందితులు తదుపరి విచారణ అవసరం లేదని నివేదించగా.. సునీల్ యాదవ్ మాత్రం తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరడం విశేషం. ‘ఈ హత్యలో సునీతారెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపణలున్నాయి. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ వారిపై ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఈ హత్య ద్వారా పిటిషనర్ కుటుంబ సభ్యులు, వారి విస్తృత కుటుంబసభ్యుల అక్రమ చర్యలు, ఇస్లామిక్, క్రిస్టియన్ అతివాదుల చర్యలు సైతం బయటపడ్డాయి. వివేకా జీవితంలో ఇతర అంశాలను సీబీఐ పట్టించుకోలేదు. అక్రమ సంబంధాలు, సెటిల్‌మెంట్ వ్యవహారాలు, అక్రమ సంబంఽధాలున్న వారితో వివేకా ఆర్థిక లావాదేవీలు, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబంతో ఉన్న రాజకీయ కక్షలు, రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలోని సభ్యులకే కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేకా పట్టుబట్టడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వివేకా ఓ ముస్లిం మహిళను రహస్యంగా వివాహం చేసుకుని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యారు. మరో ముస్లిం యువతితో సంబంధం కలిగి ఉన్నారు. వారిద్దరినీ సీబీఐ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆయన్ను లవ్ జిహాద్ ట్రాప్‌లో పడేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ సహాయం తీసుకుని సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలి. అన్ని కోణాల్లో తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలి’ అని సునీల్ యాదవ్ కోరారు. విచారణను కోర్టు 10వ తేదీకి వాయిదా వేసింది.
ఈ రోజు నుంచి నాకు ముప్పు: సునీల్‌యాదవ్
వివేకా హత్య కేసులో సీబీఐ తదుపరి విచారణ కొనసాగించాలంటూ ఆయన కుమార్తె చేసిన అభ్యర్థన తనకు సమ్మతమేనని సునీల్‌యాదవ్ వెల్లడించారు. మంగళవారం రాత్రి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన డిబేట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఇవాళ 13 పేజీల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాను. దీంతో అందరికీ శత్రువుగా మారాను. ఈ రోజు నుంచి నాకు కచ్చితంగా ముప్పు ఉంటుంది. నాపై రకరకాలుగా కక్ష గట్టి ఉన్నారు. ఇప్పటికి ఆరుగురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందారు’ అని చెప్పారు. ‘వాళ్ల వద్ద తలొంచితే ఒకలా, వంచకపోతే మరోలా ఉంటుంది. నేను తప్పు చేశాననడం లేదు.. చేయలేదనీ అనడం లేదు. తదుపరి విచారణకు మాత్రమే సునీతమ్మకు సపోర్ట్ చేస్తున్నాను. మిగితా నిందితులు ఏ1, ఏ3 ఎలాంటి కౌంటర్లూ వేయకుండా ఉన్నారు. వారి లాయర్లు ఎవరు? వీళ్ల మొబైల్లో ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారు.. ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారో తెలియాలి. పైనున్న ప్రముఖులను కచ్చితంగా విచారించాల్సిందే’ అని సునీల్ యాదవ్ స్పష్టం చేశారు.