Visit the Amarajeevi Memorial: అమరజీవి స్మారక మండపాన్ని సందర్శించండి
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:59 AM
ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మండపాన్ని ...
తెలుగు ప్రజలకు మండలి బుద్ధప్రసాద్ పిలుపు
నిర్వహణకు నిధులివ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
స్మారక మండపం దుస్థితిని వెలుగులోకి తెచ్చిన
‘ఆంధ్రజ్యోతి’కి నిర్వహణ కమిటీ కృతజ్ఞతలు
చెన్నై, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మండపాన్ని తెలుగు వారంతా సందర్శించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని చెన్నైలో ఉన్న అమరజీవి స్మారక మండపంలో ఆదివారం మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ, స్మారక మండపంలో ఆధునీకరించిన 15 వేల గ్రంథాలతో కూడిన గ్రంథాలయ ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. మండప నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, గౌరవ అతిథిగా మండలి బుద్ధప్రసాద్, ప్రత్యేక అతిథిగా అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి, ఆత్మీయ అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర హాజరయ్యారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి స్మారక మండపం ప్రాభవం నిలిపేందుకు, నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
‘ఆంధ్రజ్యోతి’కి ధన్యవాదాలు: అనిల్ కుమార్ రెడ్డి
మండపం నిర్వహణ కమిటీ అధ్యక్షులు కాకుటూరు అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఏపీ ప్రభుత్వ ఆస్తిగా ఉన్న పొట్టి శ్రీరాములు స్మారక భవనం శిథిలావస్థలో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మంచి స్పందన వచ్చిందని, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముందుకొచ్చి అందజేసిన రూ.5 లక్షలతో గ్రంథాలయాన్ని ఆధునీకరించి, 15 వేలకు పైగా అమూల్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. స్మారక మండపం దుస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్మారక భవనం నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు ఓ లైబ్రేరియన్‌ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.