Share News

Visionary Leader: దార్శనికుడు.. చంద్రబాబు

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:28 AM

చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు స్పందించారు.

Visionary Leader: దార్శనికుడు.. చంద్రబాబు

  • అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, న్యూఢిల్లీ, విజయవాడ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు స్పందించారు. సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు. ‘భవిష్యత్తను ఊహించి, దూరదృష్టితో, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల చేపట్టే దార్శనికుడు సీఎం చంద్రబాబు. చంద్రబాబుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం. ప్రజా రాజధాని అమరావతి, పోలవరంతో పాటు పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా 2014లో పాలన మొదలుపెట్టారు. 2024లో మరింత క్లిష్ట పరిస్థితుల్లో పాలనా పగ్గాల తీసుకున్నారు. కఠిన సవాళ్లు ముందున్నా దృఢచిత్తంతో పాలన వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.


పనిలో బాస్‌: లోకేశ్‌

ఎక్స్‌ వేదికగా మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ... ‘ముప్పై సంవత్సరాలు కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు. సజీవ వారసత్వానికి నిదర్శనం. హైటెక్‌ సిటీ నుంచి క్వాంటమ్‌ వ్యాలీ వరకు, బయోటెక్‌ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు చంద్రబాబు అభివృద్ధి ప్రస్థానం సజీవంగా సాగుతూనే ఉంది. అమరావతిని భవిష్యత్తు ఆశలకు ప్రతిబింబంగా నిర్మించాలనే మన సంకల్పానికి ఆయన సూచిక. హృదయపూర్వక శుభాకాంక్షలు సర్‌. నిరంతరం అభివృద్ధి.. సంక్షేమం కోసం తపించే వ్యక్తిని ఇంట్లో నాన్న అని.. పనిలో బాస్‌ అని పిలుచుకోగలగడం నా అదృష్టం’ అని పేర్కొన్నారు.

టీడీపీ కార్యాలయంలో సంబరాలు

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, అశోక్‌బాబు, నెట్టెం రఘురాం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. కాగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎంకు గవర్నర్‌ అభినందనలు

చంద్రబాబు ప్రజలకు మరింత కాలం సేవ చేయాలని, భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం కల్పించాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. సోమవారం ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకరం చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమని గవర్నర్‌ పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎంను కలసిన వీహెచ్‌పీ నేతలు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) అఖిల భారత కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్‌ పరాందే సోమవారం సాయంత్రం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై వీహెచ్‌పీ ప్రతినిధులు పవన్‌తో చర్చించారు. సమావేశంలో వీహెచ్‌పీ నేతలు గోకరాజు గంగరాజు, టి.సత్యరవికుమార్‌, ఒబిలిశెట్టి వెంకటేశ్వరు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 06:29 AM