Swarnandhra Vision-2047: విజన్‌తోనే అభివృద్ధి వెలుగులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:36 AM
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చా. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చాను’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నిత్య విద్యార్థిగా ఉంటూ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
విద్యుత్‌లేని ఊరి నుంచి వచ్చా
రాష్ట్రంలో సంస్కరణలు తెచ్చా: చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘‘విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చా. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చాను’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నిత్య విద్యార్థిగా ఉంటూ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా నియోజకవర్గాల వారీగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్లకు అనుగుణంగా పనిచేసేందుకు నియమితులైన ‘యంగ్ ప్రొఫెషనల్స్’కు ప్రణాళికశాఖ వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. శిక్షణ ముగించుకున్న యంగ్ ప్రొఫెషనల్స్‌తో సీఎం చంద్రబాబు మంగళవారం భేటీ అయ్యారు. సీఎం మాట్లాడుతూ.. ‘‘నియోజకవర్గానికో యంగ్ ప్రొఫెషనల్‌ను నియమించడం కొత్త విధానం. నేను తొలిసారి సీఎం కాగానే ప్రాధాన్యతాంశాలను గుర్తించి.. వాటికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నా. యంగ్ ప్రొఫెషనల్స్ కూడా వారికి కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సహా మిగిలిన వారితో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల అభివృద్ధికి ప్లాన్ చేయాలి. ప్రజలకు ఏది మంచో చెప్పాలి. సరైన విధానాలు అవలంబించకపోతే ఎలాంటి పరిణామాలువస్తాయో ప్రజలకు వివరించాలి’’అన్నారు.
ఈ రోజు మంచి జరిగింది: ‘ప్రతి నియోజకవర్గానికీ ఓ బలం ఉంటుంది. సహజ వనరులు ఉంటాయి. వాటిని యంగ్ ప్రొఫెషనల్స్ గుర్తించి అధ్యయనం చేయాలి. ఆ వనరుల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యత ఒత్తిడిగా ఉందని భావించొద్దు. కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలి. నియోజకవర్గంలో 9 మంది సభ్యులతో కలిసి యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాలి. క్షేత్రస్థాయికి వెళ్లిన యంగ్ ప్రొఫెషనల్స్ ప్రభుత్వానికి, సీఎంగా నాకూ బలంగా ఉండాలి’ అని సీఎం అన్నారు. కాగా, ‘ఈ రోజు ఏపీకి సెమీకండక్టర్ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది మంచి పరిణామం. రాష్ట్రంలో ఎలాట్రానిక్ ఎకో సిస్టం ఏర్పడటానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుంది’ అని చంద్రబాబు అన్నారు. అనంతరం, శిక్షణ ముగించుకున్న 175 యంగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి కేశవ్, పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, అధికారులు పాల్గొన్నారు.