YS Jagan: కొండారెడ్డి.. చిన్న పిల్లోడా..
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:23 AM
బైక్ రేసుల నుంచి డ్రగ్స్ సరఫరా వరకూ... డ్రంకెన్ డ్రైవ్ నుంచి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వరకూ... అర డజను కేసుల్లో ఇరుకున్న వ్యక్తి చిన్న పిల్లోడా...
వైసీపీ విద్యార్థి నాయకుడిపై 6 కేసులు
18 ఏళ్లకే విశాఖలో మొదటి ఎఫ్‌ఐఆర్
వైసీపీ సర్కారులోనే వరుసగా 3 కేసులు
అయినా అమాయకుడని జగన్ కవరింగ్
పొరుగు రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ నెట్‌వర్క్
విశాఖలో నేవీ అధికారుల పిల్లలకూ ఉచ్చు
కీలకమైన 29 మందిని గుర్తించిన పోలీసులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
బైక్ రేసుల నుంచి డ్రగ్స్ సరఫరా వరకూ... డ్రంకెన్ డ్రైవ్ నుంచి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వరకూ... అర డజను కేసుల్లో ఇరుకున్న వ్యక్తి చిన్న పిల్లోడా? ఇలాంటివాడిని వెనకేసుకొస్తూ.. అమాయకుడిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేయడం మాజీ సీఎం జగన్‌కే సాధ్యమైంది. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డిపై ఏకంగా ఆరు కేసులు నమోదయ్యాయి. అయినా పిల్లోడిపై తప్పుడు కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టు చేశారంటూ తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్ పేరుతో చదివిన స్క్రిప్ట్ లో జగన్ వాపోయారు. అయితే కొండారెడ్డిపై తన పాలనలోనే మూడేళ్లలో మూడు కేసులు నమోదైన విషయాన్ని మాత్రం ఆయన విస్మరించారు. గ్యాంగ్‌లతో బైకులపై హల్‌చల్ చేస్తూ రేసింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌లతో రెచ్చిపోరు ున కొండారెడ్డిపై 2021, 2022, 2023ల్లో విశాఖ త్రీటౌన్, భీమిలి, అరిలోవ పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ లు నమోదయ్యాయి. మొదటి కేసు సమయానికి కొం డారెడ్డి వయసు 18 ఏళ్లే. అప్పట్లో వైసీపీ నేతలు పో లీసులపై ఒత్తిడి తెచ్చి అతడ్ని బయటికి తీసుకెళ్లారు.
విశాఖ కేంద్రంగా డ్రగ్స్ దందా
గత జూలై 31న విశాఖపట్నం శ్రీకృష్ణాపురంలోని అంబేడ్కర్ గురుకులంలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొండారెడ్డి, మరో పది మందితో కలసి అక్కడి సిబ్బందిని దుర్భాషలాడుతూ, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు. ప్రిన్సిపల్ రత్నవల్లి ఫిర్యాదుతో అరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 29న విజయవాడ పోలీసులు లోహిత్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఆర్జాల శ్రీవాత్సవ్‌తో పాటు హవీలా డిలైట్ అనే యువతిపై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. విశాఖ కేంద్రంగా కొండారెడ్డి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్ తెప్పించి తాను తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి భారీగా లాభపడుతున్నట్లు కొండారెడ్డి విచారణలో చెప్పడంతో పోలీసులే షాకయ్యారు. అలాగే విశాఖలో ఇంజనీరింగ్ చదువుతున్న గుడివాడ గీత్‌చరణ్ అక్టోబరులో బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్ తీసుకుని రైల్లో వస్తున్నట్లు ఈగల్ పోలీసులకు సమాచారం అంది ంది. నిఘా పెట్టిన ఈగల్ బృందాలు అక్టోబరు 31న విశాఖ రైల్వే స్టేషన్ బయట గీత్ చరణ్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న లైసర్గిక్ యాసిడ్ డైథాల్ అమైడ్(ఎల్‌ఎ్‌సడీ) 48 బోల్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తనను కొండారెడ్డి బెంగళూరుకు విమానం టికెట్ బుక్ చేసి పం పాడని, తిరుగు ప్రయాణంలో రైల్లో డ్రగ్స్ తీసుకొస్తున్నానని చెప్పిన చరణ్.. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాడు. దీంతో కొండారెడ్డి, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
విద్యార్థులే లక్ష్యంగా...
ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరులోనూ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న కొండారెడ్డి.. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ బిజినెస్ విస్తరిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కొండారెడ్డి నెట్‌వర్క్‌లో కీలకంగా ఉన్న 29 మంది వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈ నెట్‌వర్క్ విస్తరణపై ఈగల్, జిల్లాల పోలీసులు కూపీ లాగుతున్నారు. ‘విశాఖపట్నం దేశానికి ప్రధానమైన నేవల్ బేస్. కొండారెడ్డి అక్కడ నేవీ అధికారుల పిల్లల్ని సైతం ఈ ఉచ్చులోకి లాగాడు. డ్రగ్స్‌కు బానిసలైన ఆ పిల్లలు రేపు దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు బయటపెట్టే అవకాశం లేకపోలేదు. ఇది చాలా ప్రమాదకరం’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.