Research Support Website: పరిశోధనలకు సహకరించే వెబ్‌సైట్
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:45 AM
పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉపకరించేలా విశాఖ నగరానికి చెందిన యువకుడు ఆకుల పృథ్వీసాయి కృష్ణ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు.
విశాఖ యువకుడి అద్భుత ఆవిష్కరణ.. ఏడాదిపాటు శ్రమించి డిజైన్ చేసిన పృథ్వీసాయి
ఉచితంగా వినియోగించుకునే అవకాశం
విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉపకరించేలా విశాఖ నగరానికి చెందిన యువకుడు ఆకుల పృథ్వీసాయి కృష్ణ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. గీతంలో బి.ఫార్మసీ, విజ్ఞాన్‌లో ఎం.ఫార్మసీ పూర్తిచేసిన పృథ్వీసాయి కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేసి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. బోస్టన్‌లో మాస్టర్స్ పూర్తిచేసి, న్యూజెర్సీలోని ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ పనిచేస్తూనే పరిశోధకులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఏడాదిపాటు శ్రమించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.లైఫ్ (ఠీఠీఠీ.్ఞ్చట్చ. జూజీజ్ఛ) పేరుతో వెబ్‌సైట్‌ను డిజైన్ చేశారు. రిసెర్చ్ చేస్తున్న విద్యార్థులు, పరిశోధకులు తమ ప్రాజెక్టుల్లో భాగంగా రూపొందించే పరిశోధన పత్రాల సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. దీనిలోని రిసెర్చ్ కంపారిజన్ టూల్‌లో రెండు వేర్వేరు వ్యాసాలను ఒకేసారి పేస్ట్ చేసి సరిపోల్చుకునే అవకాశం ఉంది. దీంతో కాపీ కంటెంట్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా, తమ పరిశోధన పత్రాలను ఇందులో పబ్లిష్ చేసుకునే అవకాశాన్ని కూడా పృథ్వీసాయి కృష్ణ కల్పించారు. సాధారణంగా ఈ తరహా వెబ్‌సైట్‌లను వినియోగించుకునేందుకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటారు. అయితే.. పరిశోధకులకు దీన్ని పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్టు పృథ్వీసాయి వెల్లడించారు. ఇప్పటికే సుమారు 40 మంది పరిశోధకులు ఈ వెబ్‌సైట్‌లో తమ పత్రాలను పబ్లిష్ చేసుకున్నట్టు తెలిపారు. ఈ వెబ్‌సైట్ వల్ల పరిశోధన, విశ్లేషణ మరింత సులభతరం కావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. అదే సమయంలో పరిశోధనల్లో నాణ్యత కూడా పెరుగుతుందన్నారు.