Share News

Modi in Vizag: యోగాంధ్రకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:58 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకూ నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5లక్షల మంది పాల్గొంటారని అధికార యంత్రాంగం ప్రకటించింది.

Modi in Vizag: యోగాంధ్రకు సర్వం సిద్ధం

  • విశాఖలో ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ.. 30.16 కి.మీ. పొడవునా యోగా ప్రదర్శనలు

  • మొత్తం మార్గం 326 కంపార్ట్‌మెంట్లుగా విభజన

  • ఒక్కోదానిలో వెయ్యి మంది పట్టేలా ఏర్పాట్లు

  • బీచ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఏయూ, విద్యా సంస్థలు, మైదానాల్లోనూ యోగా

  • నేడు విశాఖకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

విశాఖపట్నం/న్యూఢిల్లీ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకూ నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5లక్షల మంది పాల్గొంటారని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల పొడవునా 3.6 లక్షల మందికి ఏర్పాట్లు చేసింది. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో సుమారు వెయ్యి మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని 326 భాగాలుగా విభజించింది. అలాగే యోగాసనాలు వేసేవారి కోసం పచ్చటి కార్పెట్లు పరిచారు. బీచ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాల్లో మరో లక్షన్నర మందికిపైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ నగరంతోపాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారికోసం బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాకు చెందినవారు ఏ కంపార్టుమెంట్లకు రావాలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు సమాచారం అందించారు. ప్రతి కంపార్టుమెంట్‌కు అధికారులను, వలంటీర్లను నియమించారు. యోగా వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రానికి విశాఖకు రానున్నారు. ప్రధాని, గవర్నర్‌, సీఎం, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయం సమీపాన ప్రధాన వేదిక ఏర్పాటుచేశారు. ప్రధాన వేదిక వద్ద నుంచి పార్క్‌ హోటల్‌ వరకూ 18వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వేదిక ముందు భాగంలో నేవీ అధికారులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆర్కే బీచ్‌రోడ్డులో ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 15వేల మంది పాల్గొనేందుకు షెడ్లు వేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఇదీ...

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు ఆయన భువనేశ్వర్‌ నుంచి వైమానిక దళానికి చెందిన విమానంలో బయలుదేరి 6.45కు ఐఎన్‌ఎస్‌ డేగా (నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌)కు చేరుకుంటారు. అక్కడినుంచి 7గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్‌ మెస్‌కు వెళ్లి రాత్రి బస చేస్తారు. 21వ తేదీ శనివారం ఉదయం 6.25కు రోడ్డుమార్గాన ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. 6.30 నుంచి 7.50 గంటల వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆఫీసర్స్‌ మెస్‌కు, అక్కడినుంచి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. కాగా, శనివారం దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో యోగా సంగమ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌ ‘ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా’. 2015లో ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలనే భారత్‌ ప్రతిపాదనను ఆమోదించినప్పటి నుంచి ఢిల్లీ, చండీగఢ్‌, లఖ్‌నవూ, మైసూరు, న్యూయార్క్‌, శ్రీనగర్‌తో సహా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలకు మోదీ నాయకత్వం వహించారు.

Updated Date - Jun 20 , 2025 | 05:00 AM