Share News

Minister Satyakumar Yadav: విశాఖలో ప్రకృతి వైద్య కళాశాల

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:47 AM

ఆయుర్వేద, హోమియో, యునాని, ప్రకృతి వైద్యం వంటి సేవలను ప్రజలకు మరింత చేరువచేసే లక్ష్యంతో కొత్త ఆస్పత్రుల ఏర్పాటు చర్యలను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని...

Minister Satyakumar Yadav: విశాఖలో ప్రకృతి వైద్య కళాశాల

  • రూ.4.08 కోట్లతో నిర్మాణానికి అనుమతి

  • 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు

  • 50 పడకలతో ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రికి 14.85 కోట్లు

  • 6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ, డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు

  • ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద, హోమియో, యునాని, ప్రకృతి వైద్యం వంటి సేవలను ప్రజలకు మరింత చేరువచేసే లక్ష్యంతో కొత్త ఆస్పత్రుల ఏర్పాటు చర్యలను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. ఈ చర్యల్లో భాగంగా తొలి ప్రకృతి వైద్య కళాశాల విశాఖపట్నంలో ఏర్పాటు కానుందని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రకృతి వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. విశాఖ, కాకినాడలో ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయని చెప్పారు. విశాఖలోనే ప్రభుత్వ ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగశాల కూడా రాబోతోందన్నారు. కేంద్రం 2016-17లో నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి, రెండు ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆస్పత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని.. ఆ తర్వాత వైసీపీ సర్కారు కొనసాగించకుండా బాధ్యతారహితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూపుతున్న చొరవతో కాకినాడ ఆస్పత్రికి రూ.7.17 కోట్లు, విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రికి రూ.14.85 కోట్లు, ప్రకృతి వైద్య కళాశాలకు రూ.4.08 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. విశాఖలోని విమ్స్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రకృతి వైద్య కళాశాలలో 2026-27 నుంచి ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ నాచురోపతి అండ్‌ యోగా సైన్సెస్‌’ కోర్సుల్లో తరగతులు ప్రారంభమవుతాయని, ఈ కోర్సుల్లో 50 సీట్ల భర్తీకి కేంద్రం ఆమోదం తెలుపుతుందని అన్నారు. ఈ కళాశాల పక్కనే రూ.14.85 కోట్ల వ్యయంతో 50 పడకలతో చేపట్టిన ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు.


ఆయుర్వేద ఫార్మసీ..

విశాఖ పరిధిలోని శొంఠ్యాం ప్రాంతంలో రూ.6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ, డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు భవన నిర్మాణాలు పూర్తవుతున్నాయని, రూ.5 కోట్లతో పరికరాలు, యంత్రాల కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోందని మంత్రి చెప్పారు. కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో 50 పడకలతో ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. ఇక్కడ ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య సేవలు ప్రారంభించేందుకు వైద్య పరికరాలు, యంత్రాల కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. 3నెలల్లోగా ఈ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ కింద కాకినాడ, ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కశాశాలల ఏర్పాటుకు కేంద్ర ఆయుష్‌ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Updated Date - Aug 25 , 2025 | 04:49 AM