Share News

Minister Lokesh: హైదరాబాద్‌కు దీటుగా విశాఖ

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:40 AM

ఐటీ రంగంలో హైదరాబాద్‌కు దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి 30ఏళ్లు పడితే విశాఖను పదేళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళతామని ప్రకటించారు.

Minister Lokesh: హైదరాబాద్‌కు దీటుగా విశాఖ

  • భాగ్యనగరంలో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు

  • విశాఖను పదేళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళ్తాం

  • ‘సిఫీ’ని ఏపీకి రప్పించడానికి ఎనిమిదేళ్లు: మంత్రి లోకేశ్‌

  • 2047 నాటికి విశాఖలో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ

  • రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో సగం విశాఖలోనే

  • సిఫీ ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌, ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌

  • స్టేషన్‌కు భూమి పూజ చేసిన మంత్రి

విశాఖపట్నం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో హైదరాబాద్‌కు దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి 30ఏళ్లు పడితే విశాఖను పదేళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళతామని ప్రకటించారు. విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌, ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్‌ నం.3లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్‌ లిమిటెడ్‌కు ఏపీఐఐసీ కేటాయించిన 3.6 ఎకరాల స్థలంలో ఆదివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం రుషికొండ ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో సిఫీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని లోకేశ్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించి, ప్రసంగించారు. గత 17 నెలల్లో రాష్ట్రానికి 120 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా అందులో 50శాతానికి పైగా విశాఖ జిల్లాకే వచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు భారీగా రావడం ఇదే మొదటిసారని, ఇదంతా ఒక్కరోజులో సాధ్యం కాలేదని చెప్పారు. సుదీర్ఘ చర్చలు, అనేకమంది కీలకంగా వ్యవహరించడం వల్లనే వచ్చాయన్నారు. సిఫీ సంస్థను ఏపీకి రప్పించడానికి ఎనిమిదేళ్లు పట్టిందన్నారు. రాష్ట్రానికి విశాఖపట్నమే ఆర్థిక రాజధాని అని, అభివృద్ధి విషయంలో వికేంద్రీకృత విధానం అనుసరిస్తున్నామని చెప్పారు.


ఈ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో ఒక్క విశాఖలోనే 5లక్షల ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. టీసీఎ్‌సకు ఎకరా భూమి 99 పైసలకే ఇస్తే విమర్శించారని, అయితే ఆ నిర్ణయం కారణంగా కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌, ఏఎన్‌ఎ్‌సఆర్‌, సత్వాల్‌, గూగుల్‌ వంటి పెద్ద సంస్థలు విశాఖకు వచ్చాయన్నారు. పెట్టుబడుల విషయంలో ఏపీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోనే కాకుండా ఇతర దేశాలతో కూడా పోటీ పడుతోందని చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) కేంద్రంగా ఏపీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఏ జీసీసీ అయినా ఏపీకే రావాలన్నారు.


బుల్లెట్‌ ట్రైన్‌ వేగం

ఏపీలో ఉన్నది డబుల్‌ ఇంజన్‌ సర్కారు మాత్రమే కాదని, బుల్లెట్‌ ట్రైన్‌ వేగంతో దూసుకుపోయే ప్రభుత్వమని లోకేశ్‌ అభివర్ణించారు. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఢిల్లీ వెళితే... ఏపీకి వెళ్లాలని, అక్కడ వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని సూచిస్తున్నారని, అది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. రైల్వే జోన్‌ సాధించుకున్నామని, విశాఖ స్టీల్‌ ప్లాంటు కష్టాల్లో ఉంటే కేంద్రం రూ.11,440 కోట్లు ఇస్త రాష్ట్రం రూ.4 వేల కోట్ల సాయం అందిస్తోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో స్టీల్‌ ప్లాంటు ఒక్క బ్లాస్ట్‌ ఫర్నేస్‌తో నడిస్తే ఇప్పుడు 3 బ్లాస్ట్‌ ఫర్నేసులతో 85ు ఉత్పత్తి చేసే స్థాయికి చేరిందని తెలిపారు. మరో 3 నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు. విశాఖ అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్గం బ్లాంక్‌ చెక్‌ ఇచ్చిందని, దాంతో దూకుడుగా వెళ్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు సిఫీ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. తొలిదశలో 50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తారు.


4 జిల్లాలతో గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌: లోకేశ్‌

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు 4 జిల్లాలతో ‘గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌’ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మహా విశాఖ ఆర్థిక మండలి’ నిర్వహణ, విధివిధానాలపై సీఎం ప్రకటన చేస్తారని చెప్పారు. పరిశ్రమలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే నాటికి రోడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటుకానున్న పరిశ్రమలు, కంపెనీల ద్వారా 5లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన రూ.లక్ష కోట్ల పెట్టుబడుల్లో సగం గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌కు వచ్చాయన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే గ్రేటర్‌ జోన్‌ ఆర్థిక వృద్ధి ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని వివరించారు. వచ్చేనెల 14, 15ల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నారని చెప్పారు. గూగుల్‌ సంస్థ ద్వారా దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదేనన్నారు. టీసీఎ్‌సకు కేటాయించిన భూముల్లో వచ్చే నెలలో శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. డిసెంబరులో కాగ్నిజెంట్‌ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఈవో వస్తున్నారని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఉమ్మడి విశాఖలో ఏర్పాటుకాబోతున్నదన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 05:42 AM