Tirumala Sridevi: విశాఖ ఉపాధ్యాయినికి జాతీయ అవార్డు
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:28 AM
పాఠాలు ప్రతి టీచరూ చెబుతారు. కానీ, విద్యార్థుల మనసుకు హత్తుకునేలా, వారిలో జిజ్ఞాసను మరింత పెంచేలా వినూత్న విధానాలు అవలంభించి బోధించే ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక
ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అండ్ లెర్నింగ్
విధానంలో వినూత్నంగా బోధన
విశాఖపట్నం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పాఠాలు ప్రతి టీచరూ చెబుతారు. కానీ, విద్యార్థుల మనసుకు హత్తుకునేలా, వారిలో జిజ్ఞాసను మరింత పెంచేలా వినూత్న విధానాలు అవలంభించి బోధించే ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో విశాఖపట్నానికి చెందిన మాదాబత్తుల తిరుమల శ్రీదేవి ఒకరు. ఒత్తిడి రహిత విధానాలు, వినూత్న ఆలోచనలను కలగలిపి సరికొత్త పంథాను ఎంచుకుని విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు. ‘చదువుకునేందుకు రండి- దేశ సేవకు వెళ్లండి’ అనే థీమ్‌తో విద్యార్థి దశ నుంచే దేశానికి సేవ చేయాలన్న స్ఫూర్తిని నింపుతున్న నిబద్ధతే.. ఆమెను ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుకు ఎంపిక చేసింది. టీచర్లు కలలుగనే జాతీయఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 45 మంది గురువులను ఈ అవార్డులకు ఎంపిక చేయగా, ఆ జాబితాలో ఏపీ నుంచి ఒకే ఒక్కరు చోటు దక్కించుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని పండిట్ నెహ్రూ జీవీఎంసీ మునిసిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలిగా(బయాలజీ టీచర్) పని చేస్తున్న మాదాబత్తుల తిరుమల శ్రీదేవి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్, లెర్నింగ్ విధానంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఆమె సెప్టెంబరు 5న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకోనున్నారు. అవార్డు కింద ప్రశంసాపత్రం, రూ.50 వేల నగదును అందిస్తారు.
స్కూల్ అసిస్టెంట్‌గా మొదలై..
విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస ప్రాంతానికి చెందిన తిరుమల శ్రీదేవి 2001లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్, లెర్నింగ్ విధానంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి, చదువు పట్ల ఆసక్తి పెంచుతారు. విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి ప్రాజెక్టులు చేయిస్తారు.
సరికొత్త థీమ్
‘కమ్ టు లెర్న్-గో టు సర్వ్ ద నేషన్’(చదువుకునేందుకు రండి-దేశ సేవకు వెళ్లండి) థీమ్‌తో సరికొత్త విధానాన్ని శ్రీదేవి రూపొందించారు. ఈ విధానంలో ఐ డు(టీచర్ చేస్తారు), ఉయ్ డు(టీచర్, స్టూడెంట్స్ కలిసి చేస్తారు), యూ డు(పిల్లలు చేస్తారు) అన్న కాన్సెప్ట్‌తో యాక్టివిటీస్‌ను డిజైన్ చేశారు. శ్రీదేవి బోధనా విధానాలపై ఆలిండియా రేడియో.. ‘గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్’ ప్రమోషన్, ‘గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. 2018లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు.
బోధన విధానానికి గుర్తింపు
విద్యార్థులకు భిన్నమైన పద్ధతిలో బోధన సాగించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన నూతన విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్స్ వల్ల విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెరగడంతోపాటు చదువు పట్ల ఆసక్తి పెంచగలుగుతున్నా. ప్రాక్టికల్ నాలెడ్జ్, నాలెడ్జ్ బేస్డ్ లెర్నింగ్‌కు ఈ విధానం వారధిగా నిలుస్తుంది. ప్రస్తుతం తరగతిలో టాకింగ్ రోబో ఉంది. ఇది విద్యార్థుల మాదిరిగా మాట్లాడుతూ వారిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేర్చుకున్న ప్రతి అంశాన్నీ దేశానికి సేవ చేసేందుకు ఉపయోగించాలన్నది నా ఉద్దేశం. నా మోటో కూడా అదే.
- తిరుమల శ్రీదేవి