BJP Leader Madhav: విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాదు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:08 AM
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా రెండు దశాబ్దాల కిందట అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ఆదుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ ./.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
శ్రీకాకుళం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా రెండు దశాబ్దాల కిందట అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ఆదుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుర్తు చేశారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా ఎన్డీఏ హయాంలోనే 2004లో అప్పటి ప్రధాని వాజపేయి రూ.1,400 కోట్లు కేటాయించారు. అప్పటితో ప్రైవేటు పరం కాకుండా ఇన్నాళ్లు ఆగింది. మరలా ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. విశాఖ ఉక్కును ‘సెయిల్’తో అనుసంధానం చేసేందుకు ప్రతిపాదన తీసుకువచ్చింది. స్టీల్ ప్లాంట్ విషయమై ఇప్పటికే నిర్మలాసీతారామన్‌తో కూటమి ప్రభుత్వం చర్చించింది. స్టీల్ ప్లాంట్ దేశంలోనే 9వ స్థానంలో ఉంది. పనితీరును మరింత మెరుగుపరిచి 7వ స్థానానికి తెచ్చేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల తొలగింపు అంటూ కమ్యూనిస్టులు వక్రంగా ఆలోచిస్తున్నారు. ఇందులో నిజం లేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరంకాదు. దేశంలో బీజేపీ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఈనెల 30న స్ఫూర్తి పేరిట సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను పర్యటనల ద్వారా గుర్తించాను. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, అలాగే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తాను.’ అని పేర్కొన్నారు