Visakhapatnam: ప్రైవేటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాస్టింగ్ మిషన్ విభాగం
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:43 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తోంది. ఇటీవలే ప్లాంటులో 32 విభాగాలను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం..
రూ. 131 కోట్లతో టెండర్ పిలిచిన యాజమాన్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తోంది. ఇటీవలే ప్లాంటులో 32 విభాగాలను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం.. కంటిన్యువస్ కాస్టింగ్ మిషన్ విభాగాన్ని రూ. 131.33 కోట్లకు రెండేళ్లకు కాంట్రాక్టుకు ఇవ్వడానికి శుక్రవారం టెండర్లు పిలిచింది. ప్లాంటులో ఈ విభాగంలోనే స్టీల్ మెల్టింగ్ షాపు నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్‌ను దిమ్మలుగా పోస్తారు. ఒకప్పుడు ప్రపంచంలోనే ఇది అతి పెద్దది. 24 గంటలూ ఇది పనిచేస్తుంది. ఇక్కడ తయారైన స్టీల్ దిమ్మల(బ్లూమ్స్)ను ఆ తరువాత వైర్ రాడ్లుగా మారుస్తారు. ఇది అత్యంత కీలకమైన విభాగం. లిక్విడ్ స్టీల్‌ను లాడిల్స్‌తో తీసుకువచ్చి అచ్చులు పోస్తారు. ఇక్కడ సుమారు 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. షిఫ్ట్‌నకు 70 నుంచి 80 మంది ఉంటారు. కాంట్రాక్ట్‌కు ఇస్తే.. కేవలం పర్యవేక్షణకు నామమాత్రంగా అధికారులను పెట్టి మిగిలిన వారికి వీఆర్‌ఎస్ ఇస్తారని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈ స్టీల్ ప్లాంటులో గతంలో కేవలం క్లీనింగ్, మెకానికల్, ఎలక్ర్టికల్ పనులను మాత్రమే ప్రైవేటు నిర్వహణకు, కాంట్రాక్టుకు ఇచ్చేవారని, ఇప్పుడు నేరుగా విభాగాల ఆపరేషన్లను కూడా ప్రైవేటు సంస్థలు/వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ కాంట్రాక్టుల వల్ల యాజమాన్యానికి ఖర్చులు తగ్గడం లేదని, నిజానికి గతం కంటే ఎక్కువ వ్యయం కూడా అవుతోందని ఆరోపిస్తున్నారు.