Visakhapatnam Steel Plant: ఉక్కుకు పూర్తిస్థాయిసీఎండీ ఎప్పుడో
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:21 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు పూర్తిస్థాయి సీఎండీ నియామకంపై దోబూచులాట కొనసాగుతోంది. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తేవడానికి పూర్తి సాయం అందిస్తున్నామని చెబుతున్న....
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఏడాదిగా ఇన్‌చార్జి పాలన
నవంబరు ఆఖరుతో రిటైర్ కానున్న ఏకే సక్సేనా
పూర్తిస్థాయి సీఎండీగా గతంలో ఎంపిక చేసిన శక్తిమణికి రెండు రోజుల కిందట వేరే బాధ్యతలు
సీఎండీ నియామకంలో కేంద్రం దోబూచులాట!
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు పూర్తిస్థాయి సీఎండీ నియామకంపై దోబూచులాట కొనసాగుతోంది. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తేవడానికి పూర్తి సాయం అందిస్తున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. ప్లాంట్‌కు పూరిస్థాయి సీఎండీని నియమించడంలో మాత్రం ఆశ్రద్ధ వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్) చైర్మన్‌గా ఉన్న ఏకే సక్సేనాను ఏడాది క్రితం ఇన్‌చార్జి సీఎండీగా నియమించారు. ఆయన మొదట్లో వారానికి ఒకరోజు, ఆ తర్వాత రెండు రోజులు వచ్చి ఇక్కడ వ్యవహారాలు చూసుకునేవారు. సక్సేనా నియామకాన్ని ఉద్యోగ వర్గాలు మొదట్లోనే తీవ్రంగా వ్యతిరేకించాయి. వారు భయపడినట్టుగానే ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించేశారు. హెచ్‌ఆర్‌ఏ తీసేశారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తే చాలనే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఆయన ఏడాది పరిపాలనలో ఉద్యోగులకు మూడు నెలల జీతం బకాయి పడింది. సక్సేనా కొనసాగుతుండగానే పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ కమిటీ పూర్తిస్థాయి సీఎండీ కోసం ప్రకటన ఇచ్చి ‘ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శక్తిమణిని ఎంపిక చేసింది. కానీ, బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. ఇలా దాదాపు ఎనిమిది నెలల కాలం గడిచిపోయింది. తాజాగా ట్రావెన్‌కోర్ కంపెనీలో సీఎండీ పోస్టు ఖాళీ కాగా.. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ కమిటీ శుక్రవారం శక్తిమణిని ఎంపిక చేసింది. దీంటే ఆయన విశాఖ స్టీల్‌కు సీఎండీగా రానట్టేనని తేలిపోయింది.
వేరే సంస్థలకు అలా.. ఇక్కడ ఇలా..!
ఇదిలా ఉండగా, ఎంఓఐఎల్ సీఎండీ సక్సేనా పదవీ కాలం నవంబరు 30తో ముగియనుంది. అక్కడి సీఎండీ పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించించిన కమిటీ.. అందులోనే కమర్షియల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్ సురేశ్‌ను శనివారం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు సీఎండీ పోస్టు ఖాళీ అవుతుంటే.. వాటిని ముందుగానే గుర్తించి, ఇంటర్వ్యూల ద్వారా తగిన వారిని ఎంపిక చేస్తుంది. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అలా ఎందుకు చేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని పదేపదే పార్లమెంట్‌లో చెబుతున్న మంత్రులు పూర్తిస్థాయి సీఎండీని ఎందుకు నియమించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, సక్సేనాను రిటైర్‌మెంట్ తర్వాత కూడా స్టీల్‌ప్లాంట్ బాధ్యతల్లో కొనసాగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పనితీరుపై ఢిల్లీ పెద్దలకు విశ్వాసం ఉంటే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలి కానీ.. ఇలా ఇన్‌చార్జి పేరుతో కొనసాగించడం తగదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికులను సక్సేనా పెద్ద సంఖ్యలో తీసేయడం స్థానిక కూటమి నేతలను ఇరకాటంలోకి నెట్టింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నా ఉక్కు మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదు.