Share News

Visakhapatnam Police: దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:26 AM

దొంగ నోట్ల ముఠా గుట్టును విశాఖపట్నం పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నిందితుడిని అరెస్టు చేశారు.

Visakhapatnam Police: దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు

  • మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అరెస్టు, మరో ముగ్గురి కోసం గాలింపు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దొంగ నోట్ల ముఠా గుట్టును విశాఖపట్నం పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను గురువారం పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీ మేరీ ప్రశాంతి విలేకరులకు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా సెంద్వా తాలుకా కెర్మలా గ్రామానికి చెందిన శ్రీరామ్‌ అలియాస్‌ గుప్తాను దొంగనోట్ల తయారీ కేసులో ఉజ్జయిని ఎస్టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గంగాధర్‌ అనే వ్యక్తి ద్వారా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 11లో నివాసం ఉంటున్న పాల వరప్రసాద్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. విశాఖలోని తన ఇంట్లో దొంగ నోట్లు తయారుచేసుకోవచ్చని వరప్రసాద్‌ చెప్పడంతో.. శ్రీరామ్‌ దొంగనోట్ల తయారీకి అవసరమైన ప్రింటర్‌, పేపర్లు, కటింగ్‌ యంత్రాలు, గమ్‌, రంగులు ముంబై తెప్పించాడు. మొదటి దశలో రూ.10 లక్షలు విలువైన రూ.500, రూ.200 నకిలీ నోట్లు తయారుచేసి, నగరానికి చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి ద్వారా చలామణి చేసేందుకు విఫలయత్నం చేశారు. మళ్లీ రూ.500, రూ.200 నకిలీ నోట్ల తయారీని ఇటీవల ప్రారంభించారు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో ఎంవీపీ పోలీసులతో కలిసి బుధవారం రాత్రి వరప్రసాద్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో దొంగ నోట్లు తయారుచేస్తూ శ్రీరామ్‌ పట్టుబడ్డాడు. ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్‌తోపాటు ఒకే పేపర్‌పై నాలుగు చొప్పున రూ.500, రూ.200 నకిలీనోట్లు ప్రింట్‌ చేసిన కాగితాలతోపాటు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 05:27 AM