Revenue Department: మళ్లీ మొదలెట్టారు
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:24 AM
విశాఖ శివార్లలోని పెందుర్తి మండలం ఎస్‌ఆర్ పురంలో (సౌభాగ్యరాయపురం) సుమారు 100 ఎకరాల డీ పట్టా భూములను చేజిక్కించుకునేందుకు వైసీపీ హయాంలో అప్పటి పెద్దలు, ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి ప్రయత్నించారు.
డీపట్టా భూములపై వైసీపీ ‘డీల్’ అమలుకు యత్నాలు
పెందుర్తిలో ఆ భూములపై నాడు వైసీపీ పెద్దల కన్ను
ఫ్రీహోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలకు అప్పట్లో అనధికార ఒప్పందాలు
50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి
ఎన్నికల కోడ్ రావడంతో ఆగిన ఫ్రీహోల్డ్ ప్రక్రియ
కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే యత్నం
సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
విశాఖ శివార్లలోని పెందుర్తి మండలం ఎస్‌ఆర్ పురంలో (సౌభాగ్యరాయపురం) సుమారు 100 ఎకరాల డీ పట్టా భూములను చేజిక్కించుకునేందుకు వైసీపీ హయాంలో అప్పటి పెద్దలు, ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ రావడంతో వారి ప్రయత్నాలకు కళ్లెం పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరి భూదందాకు శాశ్వతంగా తెరపడినట్టేనని భావించారు. కానీ, ఆ భూములు దక్కించుకోవడానికి తెర వెనుక మంత్రాంగాన్ని మళ్లీ మొదలెట్టారు. రెవెన్యూ శాఖలోని ఓ కీలక వ్యక్తి తరఫున విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు పావులు కదుపుతున్నారనీ, ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి సాయం కోరుతున్నారనీ తెలుస్తోంది. ఈ అంశం రెవెన్యూశాఖ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....రాష్ట్రంలో రైతుల సాగులో ఉన్న డీ ఫారం భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు జారీచేయాలని గత ప్రభుత్వం 2022లో యోచించింది. దీనిపై ఉప్పందుకున్న కొందరు పెద్దలు విశాఖ నగర శివారునున్న ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పద్మనాభం, విశాఖ రూరల్‌లో వాలిపోయారు. రైతుల నుంచి డీ పట్టా భూముల కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కొంతసొమ్మును వారికి అడ్వాన్స్‌గా ఇచ్చేశారు.
ఫ్రీహోల్డ్ అవుతాయని తెలుసుకుని..
పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం గ్రామంలో సుమారు 150 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. ఇందులో 50 ఎకరాల వరకు పెద్ద రైతులు; 100 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జీవో గత ప్రభుత్వం ఇవ్వనుందని తెలుసుకుని కీలక ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగారు. ఈ గ్రామానికి చెందిన వైసీపీ నేత (ఇప్పుడు జనసేనలో ఉన్నారు)తోపాటు మరికొందరు మండల నాయకుల సాయంతో పావులు కదిపారు. ఆయన తరపున త్రిలోక్, ఇతర వ్యక్తులు ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల రేటు చొప్పున సుమారు 50 ఎకరాలకు అడ్వాన్స్‌లు ఇచ్చి అగ్రిమెంట్లు రాయించుకున్నారు. వైసీపీకి చెందిన పెద్ద నాయకులు, కొందరు చోటా నాయకులు కూడా ఇదే ధరకు 60 ఎకరాల వరకు కొనుగోలుకు ఒప్పందాలు చేశారు. వీరంతా ఎకరాకు రూ.5-6 లక్షల చొప్పున అడ్వాన్స్‌లు ఇచ్చి అనధికారికంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఇంతలో ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీకి జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిని పరిశీలించే సమయంలోనే ఫ్రీహోల్డ్ భూముల వివాదం చెలరేగడం, ఆ తరువాత 2024 ఫిబ్రవరిలో ఎన్నికోల కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి కలెక్టర్... ఎస్‌ఆర్.పురం భూముల ఫైల్‌ను పక్కన పెట్టేశారు. ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది.
రంగంలోకి సీనియర్ అధికారి..
వైసీపీ హయంలో సుమారు 50 ఎకరాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి (తరువాత పదవీ విరమణ చేశారు) ఇటీవల తనకు పరిచయం ఉన్న సీనియర్ అధికారి వద్దకు తన మనుషులకు పంపారని ప్రచారం సాగుతోంది. గతంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన భూములను విక్రయించేలా చేసి తన డబ్బులు తనకు వచ్చేలా సాయపడాలని కోరినట్టు సమాచారం. దీంతో సదరు ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. సదరు భూములను ఫూలింగ్ చేయాలని వీఎంఆర్‌డీఏకు (విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ) సూచించారు. దీనివల్ల వీఎంఆర్‌డీఏకు ప్రయోజనం చేకూరుతుందని పైకి చెబుతూ, పరోక్షంగా రిటైర్డ్ ఉన్నతాధికారికి మేలుచేసేలా పావులు కదిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్ పురం డీ పట్టా రైతులు ఆగ్రహిస్తున్నారు. తమ భూములను వీఎంఆర్‌డీఏ తీసుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు జారీచేస్తే సర్వహక్కులు తమకు దఖలు పడతాయని, అప్పుడు ఎకరా రూ.5-6 కోట్లు పలుకుతుందని చెబుతున్నారు. అదే వీఎంఆర్‌డీఏకు ఇస్తే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరాకు 900 గజాల చొప్పున ఇస్తే రూ.2 కోట్లకు మించి రాదని అంటున్నారు. అయితే గతంలో ఈ భూములకు అడ్వాన్స్‌లు ఇచ్చిన వ్యక్తుల (రిటైర్డ్ ఉన్నతాధికారి కాకుండా.. వైసీపీకి చెందిన స్థానిక నాయకులు) తరపున ఇటీవల కొందరు బ్రోకర్లు రంగంలోకి దిగారు. అమరావతి కేంద్రంగా రెవెన్యూలో కొందరు పెద్దలతో వారు సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరంతా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తోంది.