Share News

Visakhapatnam: ఐటీసీ గోదాం ఆహుతి

ABN , Publish Date - Jul 20 , 2025 | 05:20 AM

విశాఖపట్నం జిల్లాలో ఐటీసీ కంపెనీకి చెందిన గోదాంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Visakhapatnam: ఐటీసీ గోదాం ఆహుతి

  • విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. నిత్యావసర సరుకులన్నీ దగ్ధం

  • కూలిన పైకప్పు.. కోట్లలో ఆస్తి నష్టం

ఆనందపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లాలో ఐటీసీ కంపెనీకి చెందిన గోదాంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ నిల్వ చేసిన నిత్యావసర సరుకులన్నీ దగ్ధం అయ్యాయి. ఆస్తి నష్టం రూ. కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆనందపురం మండలం గండిగుండం-రామవరం రహదారిలో ఉన్న గోదాంలో రాత్రి సుమారు 12 గంటలకు మంటలు మొదలయ్యాయి. కొద్ది సేపటికే మొత్తం వ్యాపించాయి. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి నుంచి ఎనిమిది అగ్నిమాపక శకటాలు వచ్చాయి. శనివారం ఉదయానికి మంటలను పూర్తిగా అదుపు చేయగలిగారు. అయితే సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఈ గోదాంలో సరుకులన్నీ దాదాపు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. పైకప్పు కూడా కూలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోల్‌కతాకు చెందిన బాబీ ఘోష్‌, మరికొంతమంది ఈ గోదాంను లీజుకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఐటీసీ ఉత్పత్తులు సరఫరా చేస్తుంటారు. ఈ గోదాం కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు వికృతి శ్రీనివాసరావుదిగా స్థానికులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Updated Date - Jul 20 , 2025 | 05:22 AM