Share News

Visakhapatnam: విశాఖకు దక్షిణ కోస్తా జోన్‌ జీఎం

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:57 AM

విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌గా నియమితులైన సందీప్‌ మాధుర్‌ ఆకస్మికంగా నగరానికి వచ్చారు. ఆయన్ను ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వం నియమించగా....

Visakhapatnam: విశాఖకు దక్షిణ కోస్తా జోన్‌ జీఎం

  • ఆకస్మిక పర్యటన.. అధికారులతో చర్చలు

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌గా నియమితులైన సందీప్‌ మాధుర్‌ ఆకస్మికంగా నగరానికి వచ్చారు. ఆయన్ను ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వం నియమించగా, అదే రోజు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ముందస్తు సమాచారం లేకుండా గురువారం రాత్రి ఇక్కడకు వచ్చిన ఆయన ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలోని రైల్వే గెస్ట్‌ హౌస్‌లో బస చేశారు. శుక్రవారం డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లి అధికారులను పరిచయం చేసుకున్నారు. ఇక్కడ ఉన్న విభాగాలు, వసతులపై చర్చించారు. శనివారం ఉదయం తిరుపతి బయలుదేరి వెళ్లారు. అక్కడ గుంతకల్‌ డివిజన్‌ అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తరువాత విజయవాడ వెళ్లి అక్కడి అధికారులతో సమావేశమైన అనంతరం తిరిగి ఢిల్లీ వెళతారని సమాచారం.

ఆగస్టులో ఆపరేషన్‌ ప్రారంభం?

ఆగస్టు నుంచి విశాఖలో జీఎం కార్యాలయం ప్రారంభమవుతుందని విశ్వసనీయంగా తెలిసింది. ఈలోగా జీఎం కార్యాలయానికి అవసరమైన భవనం ఎంపిక జరుగుతుంది. అలాగే వాల్తేరు డివిజన్‌లో కొన్ని ప్రాంతాలను తీసుకువెళ్లి కొత్తగా ఏర్పాటుచేసిన రాయగడ డివిజన్‌లో కలిపిన సంగతి తెలిసిందే. ఒడిశా పెద్దలు ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఉన్న కొత్తవలస స్టేషన్‌ను కూడా రాయగడకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీకి పంపిన నివేదికలో కొత్తవలస ఈ డివిజన్‌లో ఉండాలని ఇక్కడి అధికారులు స్పష్టంచేశారు.

Updated Date - Jun 15 , 2025 | 05:59 AM