CM Chandrababu Naidu: ఆసియా టెక్ హబ్‌గా విశాఖ
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:25 AM
దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్‌గా విశాఖ రూపొందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ-జీవీఎంసీ సంయుక్తంగా....
‘సీ-కేబుల్’తో ప్రపంచం అనుసంధానం
విశాఖను నంబర్ 1 సిటీగా మారుస్తాం
బీచ్‌రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను
ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
మహిళలతో కలిసి కాసేపు ప్రయాణం
విశాఖపట్నం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్‌గా విశాఖ రూపొందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ-జీవీఎంసీ సంయుక్తంగా బీచ్‌రోడ్డులో నడపనున్న రెండు డబుల్ డెక్కర్(హాప్ ఆన్-హాప్ ఆఫ్) బస్సులను శుక్రవారం ఆయన స్థానిక కాళీమాత ఆలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విశాఖలో త్వరలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతున్నందున సీ-కేబుల్ వేస్తారని తెలిపారు. దీనివల్ల విశాఖతో ప్రపంచం అనుసంధానమవుతుందన్నారు. విశాఖ దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్ మారనుందని చెప్పారు. విశాఖకు వస్తే తనకు కొత్త ఉత్సాహం వస్తుందని, నగరానికి ఎన్‌డీఏ నేతలమంతా రుణపడి ఉన్నామని అన్నారు. భవిష్యత్తులో విశాఖను నం.1 సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎన్‌డీఏ కృషి చేస్తోందని చెప్పారు. విశాఖ నగరానికి బీచ్ కలిసొచ్చే అంశమని, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారని తెలిపారు. వీరందరూ బీచ్‌రోడ్డులో ఉండే 14 పర్యాటక ప్రాంతాలను ఒకేరోజు సందర్శించేందుకు వీలుగా తొలిదశలో రెండు డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించినట్టు చెప్పారు. ఒక్కో బస్సులో 66 మంది ప్రయాణించేఅవకాశం ఉంటుందని, డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో బస్సుల సంఖ్య పెంచుతామన్నారు. భవిష్యత్తు ఎలక్ర్టిక్ వాహనాలదేనని, ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులను కూడా ఎలక్ర్టిక్ మోడ్‌లోనే తీసుకున్నామన్నారు. బస్సుకి ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు.
గుంతలు పెట్టిన వారు.. గుంతల్లోకే!
విశాఖను రాజధాని చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని, కానీ.. తమకు ఆ అవసరం లేదని ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని సీఎం వ్యాఖ్యానించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారని తెలిపారు. రోడ్లపై గుంతలు పెట్టిన ప్రభుత్వం.. గుంతల్లోనే కొట్టుకుపోయిందని విమర్శించారు. విశాఖ బీచ్‌ను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్నట్టు చెప్పారు. దేశంలోనే మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపికైందని, ఈ పరిణామం విశాఖకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణమని చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు. ‘‘భవిష్యత్తులో ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు ఎక్కడెక్కడి వారో వస్తారు. మీ మంచితనం, నడవడికతో వారిని మార్చుకోవాలి. అంతేతప్ప, వారిని చూసి మీరు మారిపోవద్దు.’’ చంద్రబాబు సూచించారు.
పర్యాటకుల కోసమే..
డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ఓ బస్సులో ప్రయాణించారు. టికెట్ ధర రూ.500గా నిర్ణయించగా, దీనిలో రూ.250 ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. ఒకసారి టికెట్ కొంటే 24 గంటలపాటు ఆ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించామన్నారు. పర్యాటకుల ఆదరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తరచూ ప్రయాణించే వారి కోసం మరింత రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం డబుల్ డెక్కర్ బస్సులో నగర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పార్క్ హోటల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు.