Visakhapatnam : గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖ
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:37 AM
విశాఖపట్నాన్ని గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది.
‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ నినాదంతో రేపటి నుంచే భాగస్వామ్య సదస్సు.. భారీ ఏర్పాట్లు
భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యం
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు
సదస్సు ముగింపు వరకూ అక్కడే
భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్‌తో భేటీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే’గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది. సీఐఐతో కలిసి 30వ ‘పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు-2025’ను శుక్ర, శనివారాల్లో విశాఖలో నిర్వహిస్తోంది. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్-ఇండియాస్ రోడ్‌మ్యాప్ టు వికసిత్ భారత్’ అనే థీమ్‌తో 14, 15 తేదీల్లో జరిపే ఈ సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐటీ, ఎలక్ర్టానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. వివిధ దేశాల నుంచి వందమందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు. వారితో 30కి పైగా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనుంది.
దగ్గరుండి చంద్రబాబు పర్యవేక్షణ
సదస్సు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి ఏడు గంటలకు విశాఖ చేరుకున్నారు. బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయనతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి సమావేశమయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుపై ఆయన ఆసక్తి చూపారు. పర్యాటక రంగంలో గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సదస్సు సందర్భంగా ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా వివిధ వ్యాపార,పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యేలా సీఎం తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.
నేడు సీఎం షెడ్యూల్
విశాఖ నోవాటెల్ హోటల్‌లో ఇండియా-యూరప్ వ్యాపార ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో గురువారం ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఎస్‌పీసీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, మురుగప్ప గ్రూప్, జుల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఇంజనీర్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం ‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఐఐ ప్రత్యేక భేటీకి హాజరవుతారు.
సదస్సు తొలిరోజు...
పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సును 14వ తేదీన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. యూసఫ్ అలీ, బాబా కల్యాణి, కరణ్ అదానీ వంటి ప్రముఖులు హాజరవుతారు. మధ్యాహ్నం జరిగే ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. సింగపూర్ నుంచి నేరుగా విజయవాడకు విమానాలు నడిపేందుకు సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేస్తారు. సాయంత్రం ‘రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్’ సదస్సులో పాల్గొంటారు. సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ చైర్మన్‌తో భేటీ అవుతారు. విశాఖలో లులూ నిర్మించే మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి వివిధ కంపెనీలు, ప్రభుత్వ ప్రతినిధులకు విందు ఇస్తారు.
చివరిరోజు..
15న ఉదయం బ్లూమ్ బెర్గ్ మీడియా సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం ‘సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్‌ను ప్రారంభిస్తారు. గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఎంవోయూల కార్యక్రమంలో పాల్గొంటారు. చివరిగా.. మీడియా సమావేశం నిర్వహిస్తారు. భాగస్వామ్య సదస్సు కోసం పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు భారీగా తరలివస్తున్నారు. ఇంకోవైపు.. విశాఖలోని ప్రధాన మార్గాల్లో కూడళ్లు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. జీవీఎంసీ అధికారులు నగర సుందరీకరణ పనులు చేపట్టారు.
410 ఎంవోయూలు..9.76 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నం పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ద్వారా భారీ పెట్టుబడులు రానున్నాయి. సదస్సు వేదికగా 410కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఎనర్జీ, ఐటీ, మారిటైమ్ బోర్డ్, పర్యాటకం తదితర 11 రంగాల్లో రూ.9,76,248 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా రాష్ట్రంలో 7,48,427 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి ఎంతమేర లబ్ధి జరుగుతుందనేది కూడా అంచనా వేశారు.
సీమకు 34 ప్రాజెక్టుల ద్వారా రూ.58,883 కోట్ల పెట్టుబడులు..47,558 ఉద్యోగాలు.
కోస్తాకు 11 ప్రాజెక్టుల ద్వారా రూ.17,188 కోట్ల పెట్టుబడులు, 8,119 ఉద్యోగాలు.
దక్షిణ కోస్తాకు 17 ప్రాజెక్టుల ద్వారా రూ.13,982 కోట్ల పెట్టుబడులు, 15,720 ఉద్యోగాలు.
సెంట్రల్ ఆంధ్రాకు 8 ప్రాజెక్టుల ద్వారా 1,283 కోట్ల పెట్టుబడులు, 12,560 ఉద్యోగాలు.
ఉత్తర కోస్తాకు 42 ప్రాజెక్టుల ద్వారా రూ.3,139 కోట్ల పెట్టుబడులు, 4,308 ఉద్యోగాలు.
30 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం: 26,302 కోట్లపెట్టుబడులు..26,676 మందికి ఉద్యోగాలు
82 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు: 2,65,634కోట్ల పెట్టుబడులు..2,45,574మందికి ఉద్యోగాలు