Visakhapatnam Economic Region: విశాఖ ఎకనమిక్ రీజియన్‌కు మహర్దశ
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:28 AM
విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి: సీఎం
అవసరానికి మించి డేటా సెంటర్లను ప్రోత్సహించొద్దు
ఐటీ, ఏఐ సంస్థలకు అధిక ప్రాధాన్యమివ్వాలి
2032నాటికి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
30 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. 7 గ్రోత్ డ్రైవర్స్, 10 పాలసీలతో ఆర్థిక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు
వీఈఆర్‌పై సీఎం తొలి సమీక్ష.. 49 ప్రాజెక్టులపై చర్చ
విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు.. ఇలా అన్నివిధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్నారు. వివాదాల్లేకుండా వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ జరపాలని సూచించారు. ‘విశాఖ ఎకనామిక్ రీజియన్’ అభివృద్ధిపై ఆయన తొలిసారి విశాఖ రుషికొండలోని ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులు, తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర రంగాలకు సంబంధించిన 49ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మూడు ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2024నాటికి 52బిలియన్ డాలర్ల జీడీపీతో ఉన్న వీఈఆర్‌ను 2032కల్లా 125నుంచి 135బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. 7 గ్రోత్ డ్రైవర్లు, 10 విధానాలతో ఈ ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, దీంతో 30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేస్తే 2047 నాటికి 750 నుంచి 800 బిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవచ్చన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్
మాస్టర్ ప్లాన్ ప్రకారం రానున్న 3నెలల్లో ఏం చేయాలనే దానిపై సీఎం దిశానిర్దేశం చేశారు. ‘విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. వీఈఆర్ పరిధిలో విస్తృతంగా ఉన్న వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చు. స్టీల్ సిటీ, పారిశ్రామిక సిటీ, ఫార్మా సిటీ, టూరిజం.. ఇలా అన్ని రంగాలనూ అభివృద్ధి చేసేందుకు వీలుంది. అనకాపల్లిలో త్వరలో మెడ్‌టెక్ జోన్-2ను ప్రారంభిస్తాం. టాయ్స్ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. రక్షణ తయారీ సంస్థలను ఆకర్షించాలి. ఏజెన్సీని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించాలి. రహదారుల విస్తరణపైనా దృష్టి పెట్టాలి. ప్రతి 2నెలలకోసారి వీఈఆర్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తా’ అని సీఎం వెల్లడించారు.
శాఖల వారీగా కార్యాచరణ
విశాఖ ఆర్థికప్రాంతం కోసం వాణిజ్యం, పరిశ్రమలు, పురపాలక, పర్యాటకం, ఐఅండ్‌ఐ, ఆర్‌అండ్‌బీ, ఐటీఈ అండ్‌సీ, వ్యవసాయం, అటవీ, వైద్య ఆరోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, విద్యుత్.. ఇలా శాఖల వారీగా విడివిడిగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. దీని పరిధిలో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైనా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు సమష్టిగా ముందుకొస్తే ప్రైవేటు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆర్థిక రీజియన్‌లో ఏ ప్రాంతం ఏ పంటకు అనుకూలమో కలెక్టర్లు నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. చెరువులు, రిజర్వాయర్లను నింపాలని, ఆక్వాకల్చర్ వృద్ధికి తీసుకోవలసిన చర్యలపై నివేదికను వచ్చే సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఉన్నతాధికారుల ప్రజెంటేషన్లు
సీఎం అధ్యక్షతన జరిగిన వీఈఆర్ తొలి సమీక్షలో వీఈఆర్ కన్వీనర్ ఎన్.యువరాజ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, అజయజైన్, బి.రాజశేఖర్, ఆర్థిక, మున్సిపల్ పరిపాలన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల ముఖ్య కార్యదర్శులు పీయూ్‌షకుమార్, సురేశ్‌కుమార్, చిరంజీవిచౌదరి తమ శాఖల పరిధిలో చేపట్టబోయే ప్రాజెక్టులు, ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, పి.నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, సీఎస్ కె.విజయానంద్, ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్‌రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తదితరులు పాల్గొన్నారు.
9 జిల్లాలు.. 1.65 కోట్ల జనాభా
వీఈఆర్ విస్తీర్ణం 38 వేల చ.కి.మీ.
విశాఖ ఆర్థిక ప్రాంతం స్వరూపమిదీ..
విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. 38 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ రీజియన్‌లో 1.65 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుత జీడీపీ 52 బిలియన్ డాలర్లు. తలసరి ఆదాయం 3,170 డాలర్లు. పనిచేసేవారు సుమారు 70 లక్షల మంది ఉన్నారు.
ఈ ఎకనామిక్ రీజియన్ భౌగోళిక విస్తీర్ణం రాష్ట్రంలో 31ు ఉండగా.. జనాభా 23ు, జీడీపీ 30 శాతం.
ఏడు గ్రోత్ సెంటర్ల ద్వారా ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, గ్లోబల్ పోర్ట్సు, నెక్ట్స్ జన్ రంగాల అభివృద్ధి, ప్లాన్డ్ అర్బనైజేషన్, హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించాలన్నదే లక్ష్యం.
ప్రస్తుతం ఆరు పోర్టులు ఉండగా.. కొత్తగా రెండు రానున్నాయి.
7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారి ప్రాజెక్టులు, 77 కి.మీ. మేర మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకానున్నాయి.
12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ క్షేత్రాలు, ప్రపంచ స్థాయి నర్సరీ, ఫుడ్‌పార్కులు, ఆక్వా పార్కులు, ఐదు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని శుక్రవారం సమీక్ష సందర్భంగా నిర్ణయించారు.
అదనంగా 10 వేల హోటల్ గదులు, 20 మెడికల్ కళాశాలలు, ఐదు వేల ఆస్పత్రి బెడ్లు, పరిశ్రమల కోసం 50 వేల ఎకరాలు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీసు స్థలం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు అవసరమని గుర్తించారు.
ప్రత్యేక పర్యాటక కేంద్రంగా.. విశాఖలో కైలాసగిరి నుంచి భీమిలి వరకూ 40 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటకానికి కోర్ సిటీగా అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. ప్రధానంగా ఐదు బీచ్ ఫ్రంట్‌లు, వరల్డ్ క్లాస్ థీమ్ పార్కు, వాటర్ స్పోర్ట్స్‌తో అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కైలాసగిరి ప్రాంతం మొత్తాన్నీ మెగా రీడిజైన్ చేయనున్నారు.