Visakhapatnam: రాగిపిండి కప్పుల్లో టీ..మట్టి బాటిళ్లతో నీరు
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:53 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సు (సీఐఐ)లో జీరోవేస్ట్ విధానాలను అనుసరించనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
సీఐఐ సదస్సులో ‘జీరో వేస్ట్’ విధానం
టీ, టిఫిన్, భోజనం,స్నాక్స్ సరఫరాకు బయోడీగ్రేడబుల్ వస్తువుల వాడకం
దేశంలోనే ఇది మొదటిసారి: పట్టాభిరామ్
విశాఖపట్నం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సు (సీఐఐ)లో జీరోవేస్ట్ విధానాలను అనుసరించనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సదస్సులో ప్రతినిధులకు వంద శాతం రీసైక్లింగ్ అనుకూల బయోడీగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని నిర్ణయించామని, ఇది దేశంలోనే మొదటి ‘జీరో వేస్ట్’ మోడల్ కార్యక్రమంగా నిలిచిపోతోందని తెలిపారు. విశాఖలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చే టీకప్పులను రాగి పిండితో తయారుచేయిస్తున్నాం. మట్టితో తయారుచేసిన బాటిళ్లతో తాగునీరు అందిస్తాం. సదస్సు జరుగుతున్నప్పుడే తడి, పొడి చెత్తను వేరుచేసి తడిచెత్తను అక్కడే డీకంపోజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. సదస్సు జరిగే ప్రాంగణంలో ఫ్లెక్సీలకు బదులు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు, డిజిటల్ స్ర్కీన్‌లు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్ పద్ధతిని అందుబాటులో ఉంచుతాం’’ అని తెలిపారు. అంతకుముందు ఆయన ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో సీఐఐ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పారిశుధ్య నిర్వహణ, చెత్తసేకరణ, తరలింపు వంటి అంశాలపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.