CM Chandrababu: సదస్సు సూపర్ హిట్
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:51 AM
సీఐఐ భాగస్వాముల సదస్సు సూపర్ హిట్ అయిందని, సీఐఐ చరిత్రలో ఇంత బాగా సదస్సు జరగడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సీఐఐ సదస్సుల్లో ఇదే బెస్ట్.. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే: సీఎం
ఎంవోయూలను 100 శాతం సాకారం చేస్తాం.. మూడేళ్లలోనే సాధిస్తాం
మా మంత్రులు, అధికారులు వెంటబడతారు.. దావోస్‌కు హైబ్రిడ్ మోడల్‌గా విశాఖ సదస్సు
భారీ పెట్టుబడులతోపాటు చర్చలకూ చోటు.. రికార్డుస్థాయిలో 4,975 మంది హాజరు
గత ప్రభుత్వం ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసింది.. విద్యుత్తు పీపీఏలను రద్దు చేసింది
అలాంటివి పునరావృతం కానివ్వం.. ఎస్ర్కో ఖాతాలను తెస్తున్నాం.. ముగింపు సభలో బాబు
కేవలం పెట్టుబడుల ఆకర్షణకే కాకుండా, అవగాహనలను పరస్పరం పంచుకోడానికి కూడా విశాఖ సదస్సును ఉపయోగించుకున్నాం. దావోస్ పెట్టుబడుల సదస్సులో ఎంవోయూలు ఉండవు. ప్రపంచం భవిష్యత్తులో ఏయే రంగాల్లో ఏ విధంగా ముందుకు పోతుందనే దానిపై చర్చలు మాత్రమే ఉంటాయి. విశాఖ సదస్సు దాని హైబ్రిడ్ మోడల్. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా అవసరం కాబట్టి పారిశ్రామికవేత్తలతో ఎంవోయూలు చేసుకున్నాం. అదే సమయంలో చర్చలకు కూడా ప్రాధాన్యం ఇచ్చాం.
- సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఐఐ భాగస్వాముల సదస్సు సూపర్ హిట్ అయిందని, సీఐఐ చరిత్రలో ఇంత బాగా సదస్సు జరగడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో రెండు రోజులు జరిగిన సదస్సులో 613 ఎంవోయూలు చేసుకున్నామని, వాటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. ఎంవోయూలన్నీ నిబద్ధతగల పెట్టుబడిదారులతో చేసుకున్నవేనని, వీటన్నింటినీ మూడేళ్లలో వందశాతం సాకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమలకు వీలైనంత తొందరలోనే అన్ని అనుమతులు లభించేలా చేసి, పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూస్తామని తెలిపారు. ఒకసారి కమిట్ అయిన తర్వాత తమ మంత్రులు, అధికారులే వెంటబడిమరీ వారిని తీసుకొస్తారని సరదాగా అన్నారు. సదస్సుకు ముందు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకునేందుకు భారీ కసరత్తు చేసిందని, కేంద్రం కూడా పూర్తిస్థాయిలో సహకరించిందన్నారు. భారీ పరిశ్రమలకు మౌలిక సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పరిశ్రమలు వచ్చేకొద్దీ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటాయని, ప్రభుత్వానికి జీఎస్టీ, ఇతర రూపాల్లో ఆదాయం వస్తుందని వివరించారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో విశాఖ సదస్సు విజయవంతమైందని, ఏకంగా 4,975 మంది ప్రతినిధులు పాల్గొనడం ఒక రికార్డు అని తెలిపారు. మొత్తం 41 సెషన్స్ నడిచాయని, తాను స్వయంగా 24 ద్వైపాక్షిక చర్చల్లో భాగస్వామినయ్యానని చెప్పారు. భవిష్యత్తు తరం పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో 500 మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశామని,వారిని దృష్టిలో ఉంచుకునే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
జనవరినాటికి క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన క్వాంటమ్ మిషన్‌ను అందిపుచ్చుకునేలా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీతో కలిసి జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్‌ను సిద్ధం చేస్తున్నాం. రానున్న రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లను అమరావతి నుంచి ఉత్పత్తి చేస్తాం.’’
వైసీపీ తప్పులు పునరావృతం కాకూడదని..
‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలల కాలంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాం. వీటి ద్వారా 16.31 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుంది. విశాఖ సదస్సు ద్వారానే రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2019-2024 ఓ బ్యాడ్ పీరియడ్.. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోయినా ఫర్వాలేదుగానీ వాటిని విధ్వంసం చేశారు. సో లార్ రంగంలో విద్యుత్తు పీపీఏలను రద్దు చేసి ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు. పారిశ్రామికవేత్తలు కోర్టుకు వెళ్లారు. చివరికి కరెంటు వాడుకోకుండానే, రూ.9 వేల కోట్లు ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చింది. సింగపూర్ కంపెనీలను కూడా ఇబ్బంది పెట్టారు. మేం వచ్చిన తర్వాత వాటిని మళ్లీ తీసుకొ చ్చే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో తలెత్తిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈసారి ఎస్ర్కో అకౌంట్, దానికి సావరిన్ పవర్స్ వంటివి ఇస్తున్నాం. ప్రభుత్వం కేవలం కస్టోడియన్‌లా ఉంటుంది.’’
మీ డ్రెస్‌ల కంటే చీరలే అందం చంద్రబాబు చమత్కారం
ఆస్ట్రేలియా నుంచి సదస్సు కోసం వచ్చిన ఒక మహిళా ప్రతినిధి శుక్రవారం చీర కట్టుకున్నారు. శనివారం ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు. ఆమె ముగింపు సభలో వేదికపై కూర్చోగా చంద్రబాబు ఆమెను చూస్తూ...‘మీరు మీ దేశపు డ్రెస్‌లో కంటే..మా చీరలోనే అందంగా ఉన్నా’రంటూ చమత్కరించారు. అనంతరం విదేశీ మహిళలందరికీ చంద్రబాబు మంగళగిరి చేనేత చీరలను బహుమతిగా ఇచ్చారు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయని వివరించారు.
గేర్ మార్చాం..
‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు మారాం. పరిశ్రమలకు ఏం అవసరమో వాటిపై దృష్టి సారించాం. గ్రీన్ ఎనర్జీ లేకుంటే గూగుల్ రాదు. ఇదంతా ఓ లింకు. అందుకే గ్రీన్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి సారించాం. సూపర్ సిక్స్ అమలు చేసుకుంటూ వచ్చాం.. సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా చేస్తానని చెప్పా. అలాగే చేసి చూపిస్తున్నాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పా. ఇప్పటికే 24 లక్షల ఉద్యోగాలకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఐదేళ్లలో 500 బిలియన్ యూఎస్ డాలర్లు పెట్టుబడులు రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. దానివల్ల 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు.. కోటి మందికి ఉద్యోగాలు రావాలన్నది లక్ష్యం. ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా ప్రత్యామ్నాయంగా ఇతర రంగాల్లో ఉపాధి కల్పనపై దృష్టి పెడుతున్నాం.’’
అభివృద్ధి వికేంద్రీకరణ
‘‘రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాం. ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అదే సమయంలో ఈస్ట్ నుంచి వెస్ట్‌కు కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటవుతోంది. దీనికి చరిత్రలో లేనంత త్వరగా అనుమతులు తీసుకొచ్చాం. నేరుగా ప్రధానితో మాట్లాడి అవసరమైన అనుమతులు తీసుకొచ్చాం. లులూ మాల్ విశాఖలో 2028కి పూర్తవుతుంది. ప్రతి పరిశ్రమ ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందనే అంశంపై స్పష్టత తీసుకుంటున్నాం. అలాగే పరిశ్రమలను ఎంఎ్‌సఎంఈలతో ఎలా అనుసంధానం చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నాం. గతంలో కుటుంబానికో ఐటీ నిపుణుడు అన్నాం. ఇప్పుడు ప్రతి కుటుంబానికో ఎంటర్‌ప్రెన్యూర్.. అనేది లక్ష్యం.’’
102 పార్కులు ఖరారు.. త్వరలో మరో 77
‘‘175 నియోజకవర్గాల్లో 175 ఎంఎ్‌సఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటికే 102 పార్కులను ఖరారు చేశాం. ఇంకో 72 జనవరికి ఖరారవుతాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్లు.. మెగా పార్కులు.. ప్రైవేటు పార్కులను అనుసంధానం చేస్తున్నాం. ఎస్‌ఈజెడ్, మెడ్‌టెక్ పార్కు కలిగిన విశాఖలో ప్లగ్ ప్లే సౌకర్యం కల్పించాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. శ్రీసిటీలో 240 యూనిట్లు ఉన్నాయి. దానికోసం ఇంకో 4వేల ఎకరాలు ఇస్తున్నాం. లక్షాయాభైవేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 31 దేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టారు. రానున్న రోజుల్లో 50 దేశాల నుంచి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలన్నది లక్ష్యం. ఇదొక వినూత్నమైన పారిశ్రామిక అభివృద్ధి మోడల్.’’
జగన్ ‘ఎంవోయూ’లనూ ఫాలోఅప్ చేస్తున్నాం : సీఎం
జగన్ 2023లో విశాఖలో పెట్టిన భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని, అవి ఎన్ని వచ్చాయని విలేకరులు అడిగి ప్రశ్నకు.. అప్పట్లో పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారని, అప్పట్లో ఎంవోయూలు చేసుకున్నవారిలో ఎవరైనా ముందుకొస్తే ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పట్లో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని తిట్టేసి వెళ్లిపోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు ఇండస్ట్రీస్ పార్కుల ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే వారిని ప్రోత్సహిస్తున్నామని, ల్యాండ్ ఫూలింగ్‌కు ముందుకొచ్చినా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వపరంగా చాలా ఆదుకున్నామ న్నారు. ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీలు లాభాల్లో ఉంటే పబ్లిక్ సెక్టార్ రంగంలో నష్టాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. సమర్థ నిర్వహణ ఉండాలని, స్టీల్‌ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో నష్టాల్లో నడవడానికి వీల్లేదని, ఆ బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రంలోకి వచ్చాయని వివరించారు. భాగస్వామ్య సదస్సు రెండో రోజు శనివారం విదేశీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వచ్చే ఏడాది నవంబరులో మళ్లీ విశాఖలోనే సదస్సు నిర్వహిస్తామని, కుటుంబాలతో వచ్చి అరకు వెళ్లి కాఫీని ఆస్వాదించాలని కోరారు.