Visakhapatnam: విశాఖలో అయోధ్య సెట్ మూసివేత
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:02 AM
విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు.
విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. ఆర్‌కే బీచ్‌రోడ్డులో పార్క్ హోటల్ పక్కన మే 22న ప్రారంభించిన ఈ సెట్‌లో దర్శనానికి రూ. 50 చొప్పున వసూలు చేశారు. ఈ నెల 29న భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితుల చేతుల మీదుగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తామని ప్రకటించి టికెట్ల విక్రయం ప్రారంభించారు. దీనిపై ‘సెట్టేసి...కొట్టేస్తున్నారు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 22న కథనం ప్రచురించింది. భద్రాచలం దేవస్థానం ఈఓ కూడా నిర్వాహకులపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. ఇంత జరిగినా 29న కల్యాణోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. దాంతో ఏపీ సాధుపరిషత్, హిందూ సంఘాల సభ్యులు బుధవారం అక్కడికి వెళ్లి సెట్‌ను పరిశీలించారు. అయోధ్యలో బాలరాముడి దర్శనానికే టికెట్ లేదని, ఇక్కడ ఎలా పెడతారని ప్రశ్నించారు. సెట్లు వేసి దోచుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. సెట్ ప్రాంగణంలో స్టాళ్లు పెట్టుకోవడానికి తమనుంచి నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. స్వచ్ఛందంగా మూసేస్తే మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
కాగా, సెట్‌ను ప్రారంభించినపుడు 45 రోజులకు అనుమతి తీసుకున్నారు. ఆ తరువాత బీజేపీ పెద్దలతో చెప్పించి ఇంకో 15 రోజులు గడువు తీసుకున్నారు. ఆగస్టు 5వరకు అనుమతి ఉన్నట్టు చెబుతున్నారు. ఈ సెట్, అక్రమ వసూళ్లపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. సమస్య తీవ్రతరం కాకముందే ఆలయ సెట్‌ను మూసేయాలని ఆదేశించారు. దాంతో నిర్వాహకుడు గరుడా దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం 6గంటలకు సెట్‌కు తాళాలు వేశారు. సామగ్రిని వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.