బెజవాడలో ఉగ్ర కదలికలు.. సంచలనంగా మారిన నిఘా సంస్థల నివేదిక..
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:28 AM
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో ఉంటున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రస్తుతం పది మంది అనుమానితులను నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. వారి కార్యకలాపాలపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
-‘సిమి’తో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన
- 10 మంది అనుమానితుల గుర్తింపు.. వారి కదలికలపై నిఘా
- విజయవాడలో నలుగురు.. శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురు
-ఏసీ మెకానిక్‌లు, మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీకొట్లలో పనులు
- ఒకప్పుడు నక్సల్స్, తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా బెజవాడ
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో ఉంటున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రస్తుతం పది మంది అనుమానితులను నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. వారి కార్యకలాపాలపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో బెజవాడలో నిఘా వర్గాలు జల్లెడ పట్టి కేంద్ర నిఘా సంస్థలకు నివేదిక ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా రెండు నెలల కిందటే ఢిల్లీలోని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం విజయవాడ పోలీసులను అప్రమత్తం చేసింది. సిమీ సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని కేంద్ర నిఘా వర్గాలు సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. సిమి సంస్థతో సంబంధాలు కలిగిన వారుగా అనుమానిస్తున్న వారి కదలికలపై స్థానిక నిఘా వర్గాలు దృష్టి సారించాయి. దాదాపుగా నెల రోజుల పరిశీలన అనంతరం విజయవాడ నగరంలో నలుగురు, నగర శివారు ప్రాంతాలలో మరో ఆరుగురిని అనుమానితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ పది మందికి సంబంధించిన సమాచారాన్ని విజయవాడ నిఘా వర్గాలు కేంద్ర నిఘా సంస్థలకు అందించాయి. నెల రోజుల కిందటే ఈ సమాచారాన్ని ఇచ్చాయి. ఈ ప్రక్రియ అంతా కూడా అత్యంత రహస్యంగా జరగటం విశేషం. అయితే గుర్తించిన అనుమానితులను సిమీ ఉగ్రవాదులేనని ఇతిమిద్దంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి వీరంతా అనుమానితులుగానే ఉన్నారు. వీరి కదలికలపై అయితే నిరంతరాయంగా నిఘా కొనసాగుతోంది.
కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన
కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో స్థానిక నిఘా వర్గాల పరిశీలనలో నగరంలోని పంజా సెంటర్, లబ్బీపేట, అశోక్‌నగర్‌లలో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. గొల్లపూడిలో కూడా కొందరు అనుమానిత వ్యక్తులు ఉన్నారని సమాచారం. విజయవాడ నగరంలో నలుగురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. మిగిలిన ఆరుగురిలో గొల్లపూడి లో ఇద్దరు, పేరు బయటకు రాని శివారు ప్రాంతాలలో మరో నలుగురు ఉంటున్నారని తెలుస్తోంది. అనుమానితుల గురించిన సమాచారం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో వృత్తి చేస్తున్నారు. ఒకరిద్దరు మసీదుల దగ్గర భిక్షాటన చేస్తుండగా.. ఇద్దరు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. మసీదుల దగ్గర బడ్డీకొట్లలో కూడా ఉంటున్నారని సమాచారం. వీరి కదలికలపై ఇప్పటికీ నిఘా కొనసాగుతూనే ఉంది. స్థానిక నిఘా వర్గాలు ఇప్పటికీ వీరి కదలికలపై నిఘా వేశాయి. విజయవాడ నగరం షెల్టర్ జోన్‌గా ఉందన్నది కేంద్ర నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అనుమానితులుగా గుర్తించిన పది మందిపైనా గత నెల రోజులుగా నిఘా కొనసాగుతూనే ఉంది.
ఒకప్పుడు మావోయిస్టులకు షెల్డర్ జోన్‌గా..
విజయవాడ నగరం పూర్వం నుంచి నక్సల్స్, ఆ తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉందనేది నిఘా వర్గాల సమాచారం. పూర్వం నుంచి చూస్తే నాటి పాతతరం నాయకుల నుంచి నేటి తరం నాయకుల వరకు కూడా విజయవాడతో రాకపోకలు ఉన్నా కూడా హింసాత్మక ఘటనలు మాత్రం మొదటి నుంచి ఇక్కడ జరగలేదు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నేత కొండపల్లి సీతారామయ్య కదలికలు ఉన్నాయి. ఆయనకు ప్రతి గ్రామంలోనూ సానుభూతిపరులు ఉండేవారు. అనేక గ్రామాలలో ఆయన పర్యటించారు. విజయవాడ నగరంలో చెప్పుకోదగ్గ సంఘటనలు చూస్తే 2006లో నక్సల్స్‌కు అత్యాధునిక రాకెట్ లాంచర్స్ వంటి ఆయుధాలు సమకూర్చుకునే శక్తి వచ్చిందన్నది వెలుగు చూసింది. విజయవాడకు ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో పెద్ద ఎత్తున రాకెట్ లాంచర్ల విడిభాగాలు వచ్చాయి. విడి భాగాలు రవాణా కావటంతో ఆ సంస్థకు అనుమానం రాలేదు. వచ్చిన సరుకును తీసుకువెళ్లే విషయంలో జాప్యం జరిగింది. ఆర్డర్ ఎవరు తీసుకుంటారన్నది తెలియకపోవటంతో అలాగే ఉంచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పోలీసులకు సమాచారం రావటం, పరిశీలిస్తే వందలాది సంఖ్యలో రాకెట్ లాంచర్ల విడిభాగాలను గుర్తించారు. ఇది అప్పట్లో పెనుసంచలనం సృష్టించింది. దీంతో విజయవాడను తరచూ నక్సల్స్ (అప్పట్లో) షెల్టర్ జోన్‌గా ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాలను పోలీసులు సైతం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలు సంఘటనలు కూడా జరిగాయి. రాకెట్ లాంచర్ల వ్యవహారంలో పాత్ర ఉందన్న కారణంతో సీపీఐ మావోయిస్టు మద్దతుదారు అయిన కోట ఆనంద్ అలియాస్ కిషోర్‌ను అరెస్టు చేయటం సంచలనం సృష్టించింది. రాకెట్ లాంచర్లు అమర్చటంలో స్పెషలిస్ట్ అయిన టెక్ మధుకు కోట ఆనంద్ స్నేహితుడన్న అనుమానంతో అరెస్టు చేశారు. విజయవాడతో తొలుత నక్సల్స్, పీపుల్స్‌వార్ గ్రూప్ ఆ తర్వాత మావోయిస్టుల కదలికలనేవి ముడిపడి ఉన్నాయి. మావోయిస్టులకు ఏ విధంగా షెల్టర్‌జోన్‌గా ఉందో అదే తరహాలో ఉగ్రవాద సంస్థల సభ్యులకు కూడా షెల్టర్ జోన్‌గా ఉంటుందన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
కొనసాగుతున్న ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు
విజయవాడ నగరంలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ధార్మిక, సేవా కార్యక్రమాలకే తప్ప ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించినట్టు కానీ, నిర్వహిస్తున్నట్టు కానీ ఏనాడు జరగలేదు. అంజుమన్ ఏ ఇస్లామియా, జమాత ఏ ఇస్లామియా వంటి సంస్థలు విజయవాడ నగరంలో సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.