వినోద్ దొరికాడు!
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:44 AM
మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుల్లో ఒకడు, ఆయన రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన కూనసాని వినోద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెటిల్‌మెంట్లు, బెట్టింగ్‌లు, పేకాట శిబిరాల నిర్వహణలో సిద్ధహస్తుడు అయిన వినోద్ వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా టీడీపీ బహిష్కృత నాయకుడు, మరో యువ నాయకుడి అండదండలతో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నాడు. తాజాగా సదరు టీడీపీ నాయకులతో ఇటీవల బంధం చెడటంతో పోలీసులతో అరెస్టు చేయించినట్లు పట్టణంలో వినికిడి.
- మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు అరెస్టు
- ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతుండగా పట్టుకున్న పోలీసులు
- రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం
- పేకాట, సెటిల్‌మెంట్లు, బెట్టింగ్ కార్యకలాపాల నిర్వహణలో సిద్ధహస్తుడు
- జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరడంలో కీలకపాత్ర
- టీడీపీ నేతలతోనూ సత్సంబంధాలు.. ఓ నాయకుడితో చెడిన బంధం
మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుల్లో ఒకడు, ఆయన రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన కూనసాని వినోద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెటిల్‌మెంట్లు, బెట్టింగ్‌లు, పేకాట శిబిరాల నిర్వహణలో సిద్ధహస్తుడు అయిన వినోద్ వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా టీడీపీ బహిష్కృత నాయకుడు, మరో యువ నాయకుడి అండదండలతో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నాడు. తాజాగా సదరు టీడీపీ నాయకులతో ఇటీవల బంధం చెడటంతో పోలీసులతో అరెస్టు చేయించినట్లు పట్టణంలో వినికిడి.
గుడివాడ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు గుడివాడలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. నాని అండదండలతో కూనసాని వినోద్ మరింతగా రెచ్చిపోయాడు. సెటిల్‌మెంట్లు, పేకాట శిబిరాలు, క్రికెట్ బెట్టింగులు యథేచ్ఛగా నిర్వహించాడు. నానితో ఉన్న సత్సంబంధాలతో వినోద్ వైపు అప్పటి పోలీసులు కన్నెత్తి చూడలేదు.
సర్వేల పేరుతో వైసీపీ శ్రేణులను ముంచేశాడు!
వినోద్ కొడాలి నానికి రాజకీయ వ్యూహకర్తగా ప్రచారం చేసుకునేవాడు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించాడు. వినోద్ విశ్లేషణలను నమ్మి గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బెట్టింగులు కట్టి కోట్లాది రూపాయలు నష్టపోయారు.
జయమంగళ పార్టీ ఫిరాయింపులో కీలకపాత్ర
జిల్లాలోని పలువురు కీలక వైసీపీ నేతలతో ఉన్న సత్సంబంధాలతో కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను వైసీపీలో చేర్చడంలో వినోద్ కీలకపాత్ర పోషించాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సమక్షంలో జయమంగళ పార్టీ కండువా కప్పుకునే సమయంలో వినోద్ పక్కనే ఉండటం విశేషం. ఎన్నికల అనంతరం జయమంగళ వైసీపీని వీడేలా, రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇటీవల జనసేనలో చేరిన వైసీపీకి చెందిన మాజీ మంత్రికి వచ్చేలా చేసేందుకు రూ.12కోట్లకు వినోద్ డీల్ కదుర్చుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో సదరు మాజీ మంత్రి నుంచి రూ.3కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జయమంగళ రాజీనామాను శాసన మండలి చైర్మన్ ఆమోదించకపోవడంతో డీల్ మధ్యలో ఆగిపోయిందని సమాచారం. ఈ డీల్‌లో ఇటీవల టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన నాయకుడు కీలక పాత్ర పోషించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కూటమి పాలనలోనూ కొనసాగిన వినోద్ హవా..
ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. పలువురు టీడీపీ నాయకులతో గత వైసీపీ హయాంలో ఏర్పడిన సత్సంబంధాలతో హవా కొనసాగింది. పేకాటలో వాటాలు పంచుకుంటూ దందాను యథావిధిగా కొనసాగించాడు. గత కొన్ని రోజులుగా పేకాట శిబిరాలను మారుస్తూ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు భాగస్వాములని సమాచారం.
పంపకాల్లో వచ్చిన తేడాలే అరెస్టుకు దారితీశాయా!
టీడీపీ నాయకులతో వాటాల పంపకంలో తేడా రావడం వినోద్ అరెస్టుకు దారితీసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి, కూనసాని వినోద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అతని వద్ద నుంచి రూ.50 వేలు నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, తనకు టీడీపీ నాయకులతో సత్సంబంధాలున్నాయని పోలీసుల సమక్షంలోనే ఓ టీడీపీ నాయకుడికి వినోద్ ఫోన్ చేసినట్లు సమాచారం.