Godavari Floods Intensify: ఉధృతంగా గోదావరి
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:56 AM
గోదావరిలో వరద తీవ్రత కొనసాగుతోంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 24 గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో...
వేలేరుపాడులో గ్రామాలకు రాకపోకలు బంద్.. పడవల ద్వారా మండల కేంద్రానికి జనం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): గోదావరిలో వరద తీవ్రత కొనసాగుతోంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 24 గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో ఆ గ్రామాల ప్రజలు పడవల ద్వారా మండల కేంద్రానికి వస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జ్ ఆర్డీవో ఎం.ముక్కంటి పర్యవేక్షణలో పంపిణీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 11,22,886 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 33.170 మీటర్లు, దిగువన 24.740 మీటర్లు నీటిమట్టం నమోదైనట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద 13.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజి నుంచి 12,59,482 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం నుంచి కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు తగ్గుముఖం పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్‌కి 6,08,233 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీరు వచ్చినట్టుగానే సముద్రంలోకి వదిలేస్తున్నారు.