Deputy CM Pawan: ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేక్
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:16 AM
ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారును గ్రామస్థుల సహకారంతో తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ సినీఫక్కీలో పట్టుకుంది. పలమనేరు రేంజర్ నారాయణ కథనం మేరకు...
అడ్డుకున్న అప్పినపల్లెవాసులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
పలమనేరు, అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారును గ్రామస్థుల సహకారంతో తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ సినీఫక్కీలో పట్టుకుంది. పలమనేరు రేంజర్ నారాయణ కథనం మేరకు... చిత్తూరు జిల్లా పులిచెర్ల మీదుగా ఎర్రచందనం దుంగలతో ఏపీ02 సీఏ9799 నంబరు కారు వెళ్తున్నట్లు అటవీశాఖ తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు శుక్రవారం తెల్లవారుజామున సమాచారం వచ్చింది. దీంతో వారు కారును మరో వాహనంలో వెంబడించారు. కారు తప్పించుకొని పుంగనూరు వైపు వెళ్లడంతో పలమనేరు సీఐ మురళీమోహన్ పలమనేరు-పుంగనూరు రహదారి వెంబడి వున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో అప్పినపల్లెలో కారును అడ్డుకోవడానికి గ్రామస్థులు రోడ్డుపై అడ్డంగా మోటారు సైకిళ్లుపెట్టారు. వాటిని ఢీకొట్టి కారు ముందుకు వెళ్లింది. దీంతో గ్రామస్థులు మోటారు సైకిళ్లపై కారును వెంబడించడంతో డ్రైవరు కారును కొంతదూరంలో విడిచిపెట్టి పారిపోయాడు. స్వాధీనం చేసుకొన్న కారును, 10 ఎర్రచందనం దుంగలను తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు రేంజర్ నారాయణ తెలిపారు.
గ్రామస్థులను మెచ్చుకున్న డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఎర్రచందనాన్ని పట్టుకున్నామని గ్రామస్థులు వెల్లడించారు. పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సహకారం అందించే ఉద్దేశంతోనే దుంగల దొంగల వాహనాన్ని వెంబడించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీనిపై పవన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఎర్రచందనం దొంగల ఆట కట్టించే క్రమంలో గ్రామస్థులు చూపిన చొరవ, ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. పోలీస్, అటవీ అధికారులను అభినందించారు.