Share News

Narsingapalli Villagers: మద్యం.. వద్దే వద్దు

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:05 AM

ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామస్థులు నడుంబిగించారు.

Narsingapalli Villagers: మద్యం.. వద్దే వద్దు

  • మద్యపానంపై నిషేధం విధిస్తూ తీర్మానం.. తాగితే రూ.500, విక్రయిస్తే 10 వేల జరిమానా

  • శ్రీకాకుళం జిల్లా నర్సింగపల్లి గ్రామస్థుల ప్రమాణం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామం.. ఒకప్పుడు వలసల ఊరుగా పేరుండేది.ఉపాధి కోసం పెద్దయెత్తున ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారు.కానీ ఇప్పుడు వంశధారజలాలతో పరిస్థితి మారి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. మరోవైపు గ్రామాభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఒళ్లు, ఇళ్లును గుల్ల చేసే మద్యం రక్కసిని గ్రామం నుంచి తరిమికొట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మద్యం తాగినా, అమ్మినా.. జరిమానా విధించేలా తీర్మానం చేశారు. ఈ మేరకు అందరూ ప్రమాణం చేసి ఆదర్శంగా నిలిచారు.

టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామస్థులు నడుంబిగించారు. బెల్ట్‌ షాపుల భరతం పట్టాలని సంకల్పించారు. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ ఇటీవల ఓ తీర్మానం చేశారు. మళ్లీ బుధవారంనాడు కొందరు పెద్దలు సమావేశమై గతంలో చేసిన మద్యపాన నిషేధ తీర్మానంపై చర్చించారు. గ్రామంలో ఎవరూ బెల్టు దుకాణాలు పెట్టొద్దని హెచ్చరించారు. మద్యం అమ్ముతున్నవారిని గుర్తించి జరిమానా విధించారు. వారి నుంచి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ గ్రామంలో సుమారు 380 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ ప్రజలు 1,300 మంది ఉంటారు. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు కాగా.. ఆర్మీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. గ్రామానికి చెందిన చాలామంది సాటుసారా, మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యువత తాగుడుకు అలవాటుపడి భవిష్యత్తును కోల్పోతున్నారు. తగాదాలతో కుటుంబాలకు దూరమవుతున్నారు. దీంతో గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించి.. గ్రామస్థులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. మద్యం తాగితే రూ.500, అమ్మినవారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని, వారిని పట్టించిన వారికి రూ.వెయ్యి బహుమతి అందిస్తామని తీర్మానం చేశారు. ఈ మేరకు అందరూ ప్రమాణం చేశారు.


దాతల సహకారంతో గ్రంథాలయం

యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో 2017లో గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షల పుస్తకాలను తెప్పించి నిరుద్యోగులకు అందించారు. గ్రంథాలయంలో చదువుకుని కొలువులు సాధించినవారు, వారి మొదటి జీతాన్ని గ్రంథాలయానికి ఇవ్వాలని నిర్ణయించారు. పదవీ విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులు గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడ్డారు.వీరు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతోపాటు గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరించి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీరి కృషితో యువకులు ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నారు.

చందాలు వేసుకుని టీచర్లకు జీతాలు

1995లో నర్సింగపల్లి గ్రామానికి జిల్లా పరిషత్‌ పాఠశాల మంజూరైంది. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోవడంతో గ్రామ కమిటీయే వలంటీర్లను ఏర్పాటు చేసింది. వారికి గ్రామస్థులు చందాలు వేసుకుని వారికి జీతాలు చెల్లించేవారు. 2005 వరకు ఈ పరిస్థితి ఉండేది. పదేళ్ల తర్వాత ప్రభుత్వం టీచర్లను నియమించింది. ఆతర్వాత కూడా పాఠశాలకు ఏం కావాలన్నా గ్రామస్థులే సమకూరుస్తున్నారు. దీంతో ఉత్తమ బోధన అందడంతో ప్రతి ఏడాది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

వలసల నుంచి అభివృద్ధి వైపు..

నర్సింగపల్లికి వలసల గ్రామంగా పేరుండేది. సాగునీటి వనరులు లేక.. పంటలు పండక చాలా మంది హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. గత టీడీపీ ప్రభుత్వం మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం మంజూరు చేసి ఈ ప్రాంతానికి వంశధార జలాలను అందిస్తుండడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. దీంతో వలసలు తగ్గాయి.


మా గ్రామం ఆదర్శంగా ఉండాలి

మా గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని నిత్యం తపిస్తుంటాం. అందుకే మద్యపానంపై నిషేధం విధించాం. దీనికి గ్రామస్థులు కూడా సహకరించడం ఆనందంగా ఉంది. కలిసికట్టుగా ఉంటే కలదు సుఖం అనే భావనలో మేమంతా ఉంటాం.

- పోలాకి షణ్ముఖరావు, మాజీ సర్పంచ్‌, నర్సింగపల్లి

యువత చెడు మార్గంలో పడొద్దని..

గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో అంతా కలిసికట్టుగా ఉంటాం. వలసల నుంచి అభివృద్ధి గ్రామంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. యువత చెడు మార్గంలో నడవకూడదనే ఉద్దేశంతో మద్యపాన నిషేధం విధించాం.

- దారపు పాపారావు, నర్సింగపల్లి

Updated Date - Sep 06 , 2025 | 06:07 AM