‘పల్లె పండుగ’ బిల్లులు పెండింగ్
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:58 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులు రూ.161.86 కోట్ల అంచనాలతో జిల్లాలో పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే ఈ పనుల బిల్లులను కేంద్రప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రూ.93 కోట్ల విలువైన పనులు పూర్తయితే రూ.34 కోట్లే మంజూరయ్యాయి. మిగిలిన బిల్లులు పెండింగ్ పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మొత్తం బిల్లులను మంజూరు చేస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఎంతమేర విడుదల చేస్తుందనే అంశంపై సందిగ్థత నెలకొంది.

- గతేడాది ఆగస్టులో రూ.161.86 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభం
- గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణానికి రూ.47 కోట్లు మళ్లింపు
- ఇప్పటి వరకు రూ.93 కోట్ల విలువైన పనులు పూర్తి
- రూ.34 కోట్లకే విడుదలైన బిల్లులు.. మిగిలిన బిల్లుల కోసం ఎదురుచూపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులు రూ.161.86 కోట్ల అంచనాలతో జిల్లాలో పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే ఈ పనుల బిల్లులను కేంద్రప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రూ.93 కోట్ల విలువైన పనులు పూర్తయితే రూ.34 కోట్లే మంజూరయ్యాయి. మిగిలిన బిల్లులు పెండింగ్ పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మొత్తం బిల్లులను మంజూరు చేస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఎంతమేర విడుదల చేస్తుందనే అంశంపై సందిగ్థత నెలకొంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు గతేడాది ఆగస్టు 23వ తేదీన జిల్లాలోని 474 గ్రామ పంచాయతీల్లో ఒకే విడతలో గ్రామసభలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయాలని గ్రామసభల్లో నిర్ణయించారు. స్థానికంగా అవసరమైన రోడ్లు, ఇతరత్రా పనులను గుర్తించి గ్రామసభలో తీర్మానం పెట్టి ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది అక్ట్టోబరులో చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రూ.93 కోట్ల విలువైన సిమెంటు రోడ్లు, గోకులాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం వంటి పనులను పూర్తిచేశారు. ఇందులో రూ.34 కోట్లను బిల్లులుగా విడుదల చేశారు. మిగిలిన బిల్లులను ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో పూర్తి చేసిన పనులకు ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్లులు విడుదల అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం లెక్కల్లో ఈ పనులు జరిగినట్లుగా చూపుతారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధుల విడుదలలో కోత పడుతుందని అధికారులు చెబుతున్నారు.
సచివాలయ భవనాలకు నిధులు
గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లాలో 387 సచివాలయ భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. అయితే ఈ భవనాల నిర్మాణం బిల్లులు మంజూరు కావడం లేదనే కారణంతో కాంట్రాక్టర్లు కొన్ని భవనాల నిర్మాణ పనులను నిలిపివేశారు. అప్పట్లో ఒక్కో సచివాలయ భవనం నిర్మాణం అంచనాను తొలుత రూ.31 లక్షలుగా నిర్ణయించారు. ఈ నిధులు చాలడం లేదనే కారణంతో ఈ మొత్తాన్ని రూ.43.60 లక్షలకు పెంచారు. వీటిలో 212 సచివాలయ భవనాల నిర్మాణాలను ఎట్టకేలకు పూర్తి చేశారు. జీ+1 పద్ధతిలో నిర్మాణం చేసే ఈ భవనాలు జిల్లాలో మొదటి శ్లాబు దశలో ఆరు, రెండో శ్లాబు దశలో 19 నిలిచిపోయాయి. శ్లాబులు పూర్తి చేసుకుని కిటికీలు, తలుపులు ఇతరత్రా తుది మెరుగులు దిద్దాల్సినవి 75 భవనాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ 75 సచివాలయ భవనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు పల్లెపండుగ నిధుల నుంచి రూ.14 కోట్లను కేటాయించారు. వీటితో పాటు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలకు పల్లె పండుగ ద్వారా మంజూరైన ఉపాధి హామీ నిధులు మరో రూ. 33 కోట్లకుపైగా నిధులను కేటాయించారు. ఈ భవనాల నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు రూపొందించిన పల్లె పండుగ పనులకు సకాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఈనెలాఖరులోగా బిల్లులు మంజూరు చేస్తేనే పనులు మరింతగా వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.